నల్లగొండ ప్రతినిధి, నవంబర్25 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పొద్దుపొద్దున్నే చలి వణికిస్తున్నా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు సామాన్యులు సైతం కేటీఆర్ ప్రయాణించే దారి పొడువునా రోడ్లపైకి వచ్చారు. లగచర్లలో దళిత, గిరిజన రైతులపై ప్రభుత్వ ఆమానుషత్వాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మహబూబాబాద్‌లో మహాధర్నాను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా మహబూబాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.
ఈ విషయం తెలిసిన ఉమ్మడి జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులంతా పెద్ద ఎత్తున కేటీఆర్‌పై అభిమానం చూపుతూ స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తమ తమ ప్రాంతాల్లో కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన కేటీఆర్‌కు ఉమ్మడి జిల్లా సరిహద్దు ప్రాంతమైన పోచంపల్లి క్రాస్ రోడ్స్ కొత్తగూడెం వద్ద ఘన స్వాగతం లభించింది. అక్కడ నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పార్టీ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పూలు చల్లుతూ, పుష్పగుచ్ఛాలిస్తూ శాలువాలు కప్పి కేటీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు.
అక్కడి నుంచి కేటీఆర్ కాన్వాయ్ చౌటుప్పల్‌కు చేరుకోగా అక్కడ కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎదురేగి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేత పాల్వాయి స్రవంతి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించారు. ఇక్కడ ట్రిపుల్ ఆర్ బాధితులు కేటీఆర్‌ను కలిసి తమ గోడును వినిపించారు. అలైన్మెంట్లో మార్పులు చేసేలా, మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ అసెంబ్లీలో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు ట్రిపుల్ ఆర్ బాధితులు తెలిపారు. అక్కడ నుంచి చిట్యాల మండల కేంద్రానికి కేటీఆర్ కాన్వాయ్ చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.
కేటీఆర్ తన వాహనం నుంచే అభివాదం చేసేందుకు బయటకు రాగా ఒక్కసారిగా పార్టీ శ్రేణులంతా “సీఎం..సీఎం.. సీఎం.. కేటీఆర్ జిందాబాద్… కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు. పార్టీ నేతలు ఇచ్చిన పుష్పగుచ్ఛాలను, శాలువాలను స్వీకరిస్తూ… నమస్కారం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. నార్కట్‌పల్లి మండలంలోకి ప్రవేశించగానే అక్కడ పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, పార్టీ రాష్ట్ర నేత కంచర్ల కృష్ణారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. పూలుచల్లుతూ, బొకేలు అందిస్తూ, శాలువాలు కప్పి పార్టీ నేతలు కేటీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటారు. కేటీఆర్ కాన్వాయ్ విజయవాడ-హైదరాబాద్ హైవే నుంచి ఎన్‌హెచ్-365 మీదకు క్రాస్ అయ్యే నకిరేకల్ మండలం చందంపల్లి వద్ద కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అక్కడ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు భారీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి అర్వపల్లి మండల కేంద్రానికి కేటీఆర్ కాన్వాయ్ చేరుకోగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ జిందాబాద్, సీఎం కేటీఆర్ అంటూ నినాదాలతో మండల కేంద్రం దద్దరిల్లింది. అక్కడ పార్టీ శ్రేణుల కోరిక మేరకు కాన్వాయ్ దిగి ఓపెన్ టాప్ జీప్‌లో కొద్దిదూరం ముందుకు కదిలారు. కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎంపీ, పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, పార్టీ నేతలు ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగేంధర్రావులు ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం గాదరి కిశోర్‌కుమార్ ఆహ్వానం మేరకు అక్కడే అర్వపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు దావుల వీరప్రసాద్‌యాదవ్ ఇంట్లో తేనేటి విందు కోసం ఆగారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌తో ఫొటోల కోసం పోటీపడ్డారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ మరిపెడ బంగ్లా మీదుగా కేటీఆర్ మహబూబాబాద్‌కు వెళ్లారు.