మునుగోడు,ఫిబ్రవరి 12: నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతంచేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సభ నియోజకవర్గ సమన్వయకర్త నందికంటి శ్రీధర్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లెరవికుమార్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
కృష్ణాజలాలు కేఆర్ఎంబీపై వాస్తవాలు వివరించేందుకు రాష్ట్ర ప్రజల హక్కుల సాథనే లక్ష్యంగా సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తున్నదని, గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించడంతో జిల్లా ప్రజలకు అందులో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.
నీళ్ల కోసం మళ్లీపోరాటం చేయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని దుయ్యబట్టారు. ఫ్లోరైడ్ మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దక్కిందని పేర్కొన్నారు. సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలించేందుకు నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పట్టణ,గ్రామశాఖ అధ్యక్షలు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.