దామరచర్ల, జూలై 7: యాదాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని తాళ్లవీరప్పగూడెంలో మాజీ ఎంపీటీసీ రాయికింది సైదులు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన నిర్వాసితుల సమావేశంలో భాస్కర్‌రావు మాట్లాడుతూ..ప్లాంట్ ఏర్పాటు సమయంలో అప్పటి ఎమ్మెల్యేగా ముందుండి ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల ఉద్యోగ, ఉపాధి కల్పనకు, ఈ ప్రాంత అభివృద్ధికి, రైతులకు అన్ని రకాలుగా లాభం చేకూర్చుతామని అందరినీ ఒప్పించి ఎలాంటి అవాంతరాలు లేకుండా భూసేకరణ కింద సాగు భూములను సైతం ఇప్పించామన్నారు. రెండు తండాలను పూర్తిగా ఖాళీ చేయించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద శాంతినగర్‌లో ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
దీంతోపాటుగా తాళ్లవీరప్పగూడెంలో ప్రజలు, రైతులు ఆరోజు భూసేకరణకు అభ్యంతరం తెలిపితే అప్ప టి విద్యత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలసి గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ప్లాంట్ రావడం వల్ల లాభం జరుగుతుందని, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి భూములను ఇప్పించామన్నారు. కానీ ఇప్పటి పాలకులు ఇవేమీ పట్టకుండా కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించి మిగతా వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అవసరమైతే ఈ సమస్యపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్‌రెడ్డిని కలసి ఈప్రాంత ప్రజలకు రావల్సిన ప్రయోజనాలను, ప్లాంటు నిర్మాణంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతామని లేకుంటా ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి, ఎండీ యూసూఫ్, హతీరాం నాయక్, సైదులురెడ్డి, సోము సైదిరెడ్డి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, నర్సయ్య, సైదయ్య, గోవిందు, నాగిరెడ్డి, ప్రకాశ్‌నాయక్, హనిమిరెడ్డి, బాలూనాయక్, కోట్యానాయక్, వినోద్‌నాయక్ తదితరులు ఉన్నారు.