సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 24 : దక్షిణ భారతదేశంలో మరో కుంభమేళాగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల కోసం అన్ని వర్గాల ప్రజలంతా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు.
సూర్యాపేట జిల్లా నుంచి 40 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అన్ని గ్రామాలు, వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధిని, 16 నెలల ప్రభుత్వ వైఫల్యాన్ని వివరించామన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో బండెనుక బండి కట్టి 16 బండ్లుగా పయనమైన రైతుల ఎడ్ల పండ్లకు గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, దీంతో రేవంత్ పాలనపై దాడి చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. నేడు కరెంట్ ఇవ్వడం లేదని, రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, పండిన కొద్ది పంటను కొనడం లేదని, ఇటీవల గుర్రంతండా వద్ద రైతులు ధాన్యం తగలబెట్టిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వస్తే తిరగబడతారని వారి వద్దకే రావడం లేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదని.. ప్రజలను, రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జిడి భిక్షం, నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.