నకిరేకల్, ఏప్రిల్ 16 : నకిరేకల్‌లో బుధవారం నిర్వహించిన అరైవ్-అలైవ్ ప్రొగ్రాంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, డీజీపీ శివధర్‌రెడ్డి సాక్షిగా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రొటోకాల్ ప్రకారం పిలవకుండా, నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచులను అవమానించారని, 2 వేల హెల్మెట్లను కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇచ్చారని, అలాంటప్పుడు పోలీస్ యంత్రాంగం బీఆర్ఎస్ సర్పంచులను ఎందుకు పిలవాలని, పిలిచి ఎందుకు అవమానించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నకిరేకల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలుచేయకుండా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
99 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ 40 రోజుల్లో ఏం చేశారో మంత్రి గానీ, ఎమ్మెల్యే గానీ చెప్పకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామ ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శులకు భారం పడటం తప్ప ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిందేమీ లేదన్నారు. పోలీసు యంత్రాంగం నియోజకవర్గంలోని సర్పంచులందరినీ కార్యక్రమానికి పిలిపించి బీఆర్ఎస్ పక్ష సర్పంచ్‌లకు, గ్రామ ప్రజలకు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అరైవ్-అలైవ్ ప్రభుత్వ కార్యక్రమమా? లేక రాజకీయా సభనా? సభలో అధికారులు, కళాశాలల విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తప్ప జనమెవ్వరూ కన్పించలేదన్నారు.
ప్రతి గ్రామంలో రోడ్ సేఫ్టీ కమిటీలు వేశారని, అందులో మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, సర్పంచులు, అధికారులు ఉండాలే గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఎవరూ కనిపించ లేదన్నారు. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 7.30 గంటలకు పాఠశాల, కళాశాల విద్యార్థులను తిండి తిప్పలు లేకుండా బలవంతంగా 7 గంటలు కూర్చొబెట్టారన్నారు. ఒక మంత్రి, డీజీపీ స్థాయి అధికారులు సమయపాలన పాటించకుండా విద్యార్థులను ఇలా నిర్బంధించడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే సభ అట్టర్ ఫ్లాప్ అని గుసగుసలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజాప్రతినిధులకు దమ్ముంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటే ఓ పక్క అధికారులకు, ప్రజాప్రతినిధులకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, కడపర్తి సర్పంచి గొర్ల వీరయ్య, కౌన్సిలర్ పల్లె విజయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గుండగోని జంగయ్య, మాజీ ఎంపిటిసిలు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్న, సీనియర్ నాయకులు రావిరాల మల్లయ్య, దైద పరమేశం, ఎస్కె అమీర్‌పాషా, అవిరెండ్ల జనార్దన్, చిట్యాల అశోక్, తదితరులు పాల్గొన్నారు.