కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న రైతు మోసాలపై నల్లగొండ వేదికగా జంగ్‌సైరన్‌కు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. అసంపూర్తి రుణమాఫీ, కోతల రైతు భరోసాలతోపాటు బోనస్ ఎగవేత తదితర అంశాలపై రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు క్లాక్‌టవర్ వేదికగా మహాధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రైతు మహాధర్నాకు అడుగడుగునా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తున్నా బీఆర్ఎస్ హైకోర్టు తలుపుతట్టి అనుమతులు సాధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నాకు సిద్ధమైంది. ఈ ధర్నాకు ప్రభుత్వంపై ఆగ్రహాంతో ఉన్న రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చే సంకేతాలు ఉండడంతో అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలంతా మహాధర్నాపై దృష్టి సారించారు. ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పార్టీ నేతలతో కలిపి క్లాక్‌టవర్ సెంటర్లో ధర్నా ఏర్పాట్లను సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచే తొలి సీఎం కేసీఆర్.. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశంలోగా రాష్ట్ర రైతన్నలను సగర్వంగా తలెత్తుకునేలా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఎవ్వరూ ఊహించని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటల కొనుగోళ్లు, వెనువెంటనే చెల్లింపులు ఇలా సాగుమడిలో రైతన్నను కేసీఆర్ నిరంతరం వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో దేశంలో రాష్ట్రం, రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యవసాయంలోనే అనతికాలంలోనే అగ్రభాగాన నిలిచింది. దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన జిల్లాగా నల్లగొండ చరిత్రకెక్కింది. ఏ ఊరు చూసినా పచ్చని పొలాలతో కళకళలాడింది. రైతుల మోకాల్లో వెలుగులు నిండాయి. కేసీఆర్ పాలనలో ఉమ్మడి జిల్లాలో 13లక్షల ఎకరాల నుంచి 23 లక్షల ఎకరాలకు సాగుభూమి విస్తరించింది. దీంతో ఒక్కో సీజన్లో 40లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ఉత్పత్తి జరిగింది.
ఇలా రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగంలో అత్యధిక లబ్ధి పొంది న జిల్లాగా నల్లగొండ అవతరించింది. కానీ ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం అనసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయం తిరిగి కుదేలయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. రుణమాఫీ అమలులో, రైతుభరో సా డబ్బుల్లోనూ ప్రభుత్వ విధానాలతో రైతన్నకు మొండిచెయ్యి చూపుతున్నది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ కోసం నేటికీ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల మందికి పైగా రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక రైతుభరోసా ద్వారా ఉమ్మడి జిల్లాలో 25 లక్షల మంది రైతులకు ఒక్క సీజన్లోనే ఎకరాకు రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తే సుమారు రూ.1950 కోట్ల లబ్ధి రైతులకు జరుగాల్సి ఉంది. కానీ దాన్ని ఆరు వేలకు కుదించడం వల్ల ఆ లబ్ధి రూ.1,300 కోట్లు కూడా దాటేలా లేదు. గత యాసంగిలో ఎకరం మీద రూ.2,500 కోత, వానకాలంలో మొత్తంగా రూ.7,500కు ఎసరు, ప్రస్తుత సీజన్లో సైతం ఎకరాకు రూ.1500 కోత పెట్టడం వల్ల మొత్తంగా 11,500 ఒక్కో ఎకరంపైన రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోతున్నాడు. మొత్తంగా చూస్తే సుమారు 3వేల కోట్ల రూ పాయల రైతు భరోసాకు కాంగ్రెస్ సర్కార్ ఎసరు పెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. స్వచ్ఛందంగా అనేక ప్రాంతాల్లో రైతులు వివిధ సందర్భాల్లో రోడ్లెక్కారు. పంటల కొనుగోళ్లపై, బోనస్ డబ్బుల ఎగవేతపై, రైతుభరోసా ఎగనామంపై, పలుమార్లు కరెంటు కోతలపై, ఎరువుల కొరతలపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ తోడ్పాటు కొరవడడంతో రైతులు సాగుమడిలో చతికిలపడుతూ ఆత్మైస్థెర్థ్యం కోల్పోతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. దీంతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 30 మంది వర కు రైతులు ఏడాది కాలంలో తనువు చాలించినట్లు రైతు సంఘాల అంచనా. ఇట్లాంటి తిరోగమన పరిస్థితుల్లో రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు.
రైతుభరోసా మోసంపై నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్ వేదికగా తలపెట్టిన రైతుమహాధర్నాలో కేటీఆర్ పాల్గొననున్నారు. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో మంగళవారం ఉదయం 11 గంటలకు రైతు మహాధర్నాకు పార్టీ నేతలు చకచకా సాగుతున్నాయి. మహాధర్నాకు విస్త్రత ప్రచారం కల్పించేలా నల్లగొండలో ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటుపై దృష్టి సారించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి… ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలందరినీ ఎప్పటికప్పుడూ సమన్వయం చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన నల్లగొండ పార్టీ కార్యాలయంలో ముఖ్యులందరితో సమావేశమై మహాధర్నాపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్న రైతులే స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు కావాల్సిన సహకారం పార్టీ నేతలు అందించాలని సూచించారు. రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ధర్నాస్థలంలో ఏర్పాట్లు చేయాలని జగదీశ్‌రెడ్డి స్థానిక నేతలకు సూచించారు. కాగా ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పార్టీ నేతలతో కలిసి క్లాక్‌టవర్ సెంటర్లో మహాధర్నా ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, సభాప్రాంగణం, పార్కింగ్, ఇతర సదుపాయాలపై పార్టీ నేతలో చర్చించారు. ధర్నాకు వచ్చే పార్టీ శ్రేణులకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి వివరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, సింగం రామ్మోహన్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, పల్లె రంజిత్, రావుల శ్రీనివాస రెడ్డి, బొజ్జ వెంకన్న, లొడండి గోవర్ధన్, మెరుగు గోపి తదితరులు పాల్గొన్నారు.