తుంగతుర్తి, జూలై 13 : అసంఘటితంగా ఉన్న కార్మికులను సంఘటితం చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కార్మిక సంక్షేమ ప్రదాత అని బీఆర్ఎస్కేవీ నియోజకవర్గ ఇన్చార్జి గౌడిచర్ల సత్యనారాయణ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ ఆర్థిక సహకారంతో వంద మంది కార్మికులకు చేసిన లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. వందలాది మంది కార్మికులకు తన సొంత ఖర్చుతో లేబర్ ఇన్సూరెన్స్ చేయించారన్నారు. వారు అందించిన లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల ప్రతిఫలం నేడు లబ్ధిదారులకు రూ.9లక్షల ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. అలాగే, రోడ్డు ప్రమాదంలో మరణించిన మరో నలుగురు డ్రైవర్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున, ముగ్గురు నిర్మాణ రంగ కార్మికులకు రూ.18.9 లక్షలు అతి త్వరలో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ మండల ఉపాధ్యక్షుడు కూరపాటి సోమేశ్, గుగులోతు వీరునాయక్, గుగులోతు రవి, రాజేశ్, వెంకన్న, జయమ్మ, ముత్తయ్య, రమణమ్మ, సుజాత, అభినవ్, రామచంద్రు పాల్గొన్నారు.