నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో సమూల మార్పులను కాంక్షిస్తూ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ రజతోత్సవ సంబురానికి సర్వం సిద్ధ్దమైంది. వరంగల్ శివారులోని ఎల్కతుర్తి వేదికగా ఆదివారం బ్రహ్మాండమైన బహిరంగ సభకు పార్టీ యావత్తు సమాయత్తమైంది. బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు, అభిమానులు, సామాన్య జనంతోపాటు పార్టీలోని అన్ని స్థాయిల్లోని నాయకులంతా వరంగల్ వైపు కదిలేందుకు సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల ప్రారంభ సూచికగా ఆదివారం ఉదయం ఊరూవాడా పార్టీ జెండా పండుగ నిర్వహిస్తూ గులాబీ జెండాలు ఎగురవేయనున్నారు. అనంతరం అక్కడి నుంచే వరంగల్ సభకు బయల్దేరనున్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలంతా తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల్లోపే ఎల్కతుర్తి సభా స్థలికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రహదారులు నేడు బీఆర్ఎస్ సభా వాహనాలతోనే కిక్కిరిసిపోనున్నాయి. సాయంత్రం రజతోత్సవ సభ వేదిక మీదుగా పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ చేయనున్న ప్రసంగంపైనా రాజకీయాలకు అతీతంగా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
25 ఏండ్ల ప్రస్థానంలో 13 ఏండ్లు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏండ్లు పాలక పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలు, అభివృద్ధి నమూనాకు వేదికగా నిలిచింది బీఆర్ఎస్. రాష్ట్ర సాధన క్రమంలో ఉద్యమ కాలంలో నినాదాలుగా ఉన్న ఎన్నో సమస్యలకు అధికార పార్టీగా ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ ప్రజల మనస్సు గెలుచుకుంది. అభివృద్ధి, సంక్షేమం అనే పదాలకే కొత్త భాష్యం చెప్తూ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు ప్రతి సందర్భంలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషిస్తూనే వస్తున్నది. ప్రస్తుతం అధికారం లేకపోయినా పార్టీపరంగా ఉమ్మడి జిల్లాలో సుమారు ఆరు లక్షల మంది సభ్యులతో బలమైన పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తున్నది.
సంస్థాగతంగా పటిష్టమైన పార్టీగా ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఆవాస ప్రాంతానికి, మారుమూల తండాకు, ప్రతి బస్తీ గల్లీకి సైతం గులాబీ జెండా వెళ్లింది. మారుమూల ప్రాంతాల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదు. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానంతో బోణి కొట్టిన పార్టీ 2018 ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాల్లో గెలిపొంది చరిత్ర సృష్టించింది. తర్వాత ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చిన మూడు ఉప ఎన్నికల్లోనూ విజయ పతాకం ఎగరవేసింది. నాటి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలైన హుజూర్నగర్, మునుగోడుతోపాటు నాగార్జునసాగర్‌లోనూ విజయ ఢంకా మోగించింది. దాంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న మొట్టమొదటి పార్టీగా ఎవరికీ సాధ్యం కాని రికార్డులను బీఆర్ఎస్ సొంత చేసుకుంది.
ఆనాడు టీఆర్ఎస్కు తొలి విజయం సిద్దిపేట అందిస్తే… బీఆర్ఎస్గా ఏర్పడ్డాక 2022 చివర్లో మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బోణి అందించింది నల్లగొండ జిల్లానే. తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్త పరిణామాల్లో భాగంగా అధికారం కోల్పోయినా, ఉమ్మడి జిల్లాలో ఒక్క స్థానానికే పరిమితమైనా పడిలేచిన కెరటంలా బీఆర్ఎస్ పుంజుకుంటున్నది. అన్ని చోట్లా గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంపై జనంలో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతతో భవిష్యత్ తిరిగి బీఆర్ఎస్‌దేనన్న దృఢవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు అధికార పార్టీ నేతల ఆగడాలను ఎదుర్కొని నిలబడుతూ పార్టీని నిలబెట్టుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామన్న బలమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరికలు జరుగుతుండడం విశేషం. మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలనలోనే జనం మళ్లీ కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వ పనులను వెతుక్కునే పనిలో పడ్డారు. దాంతో కృష్ణా జలాల వివాదంపైనా గతేడాది మొదట్లో కేసీఆర్ తొలి సభకు నల్లగొండనే వేదికైంది.
ఆ తర్వాత గత యాసంగిలో పంటలు ఎండుతున్న సందర్భంలోనూ జిల్లా మీదుగానే కేసీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉమ్మడి జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ఇలాంటి సందర్భంలో పార్టీ 25 ఏండ్ల పండగకు తెరలేవడంతో నెల రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం తొణికిసలాడుతున్నది. ఇక వరంగల్ రజతోత్సవ సభ అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణానికి పెద్ద పీట వేస్తామని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దాంతో పార్టీ సభ్యత్వ నమోదు, అన్ని స్థాయిల్లో కొత్త కమిటీల ఏర్పాటు, శిక్షణ తరగతులు తదితర కార్యక్రమాలతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో జిల్లాలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ అవతరించనుందనడంలో సందే హం లేదు.
నేడు ఎల్కతుర్తి రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మార్గదర్శనంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల ఆధ్వర్యంలో లక్ష మందికిపైగా తరలి వెళ్లేందుకు సిద్ధ్దమయ్యారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గాల వారీగా రవాణా, భోజనం, మంచినీరు తదితర ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచి 10వేల మందికి తగ్గకుండా మిగతా ఎనిమిది నియోజకవర్గాల నుంచి 3 వేలకు తగ్గకుండా జనం రావచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, క్షేత్రస్థాయిలో సామాన్య జనం సైతం వరంగల్ సభకు తరలివచ్చేందుకు సిద్ధ్దమయ్యారు. దాంతో ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం అదనంగా 2వేల మంది వరకు రావచ్చని భావిస్తున్నారు.
వీరు కాకుండా రాజకీయాలకు అతీతంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా వరంగల్ సభకు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటల వరకు అన్ని వార్డులు, గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాలను ఎగురవేసి వాహనాల్లో సభకు బయల్దేరేలా ప్రణాళికలు సిద్ధ్దం చేశారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి సభాస్థలికి సమీపంలో వాహనాల కోసం జోన్-2లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
ఆలేరు వైపు నుంచి వెళ్లే వాహనాలతోపాటు తిర్మలగిరి, మెండ్రాయి మీదుగా వచ్చే వాహనాలు సైతం వరంగల్ హైవే మీదుగా కరుణాపురం దాటాక వరంగల్ బైపాస్ రోడ్డులో ప్రయాణించి అనంతసాగర్ వద్ద పార్కింగ్ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. మార్గమధ్యంలోనే భోజనం చేసుకుని సభాస్థలికి మధ్యాహ్నం రెండు గంటల వరకు చేరుకునేలా పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుండగా అధినేత కేసీఆర్ ప్రసంగం అనంతరం సభ ముగియనుంది. ఆ తర్వాత సభకు వెళ్లిన వారంతా తిరిగి స్వస్థలాలకు సురక్షితంగా చేరుకునే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అవసరమైన మంచి నీరు, మజ్జిగ ప్యాకెట్ల వంటి జాగ్రత్తలతో సభకు రావాలని సూచించారు.