మోత్కూరు, మే 23 : పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, ప్రజా గొంతుక, విద్యావంతుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కోరారు. గురువారం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన పట్టభద్రులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి ఐదు నెలల పాలనలో 20 వేల కోట్ల అప్పులు చేశాడన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పాటు పడి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అంటూ దొంగ మాటలు చెప్పి మోసం చేశాడన్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకొనేందుకు సిగ్గ్గుండాలన్నారు. క్వింటా వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఇప్పుడు 5 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్లకు ఓటేద్దామా…? పదేండ్లపాటు నిజాయితీగా పని చేసిన కేసీఆర్ అభ్యర్థి, విద్యావంతుడు రాకేశ్‌రెడ్డికి ఓటేద్దామా? అని అన్నారు. బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్నకు తగిన గుణపాఠం చెప్పేందుకు పట్టభద్రులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగ శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త గోలి శ్రీనివాస్‌రెడ్డి, మోత్కూరు, అడ్డగూడూరు బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పొన్నెబోయిన రమేశ్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కొణతం యాకూబ్‌రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేందర్నాథ్, మర్రి
అనిల్‌కుమార్ పాల్గొన్నారు.