యాదాద్రి భువనగిరి/సూర్యాపేట, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసి ప్రజలకు తెలియజేసేందుకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శుక్రవారం కాళేశ్వర యాత్రకు కదిలింది. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్లు కుంగిన సాకుతో అసలు ప్రాజెక్టే పనికిరాదన్నట్టు చేస్తూ.. రైతుల పంటలను ఎండబెడుతుండడాన్ని చలో మేడిగడ్డ కార్యక్రమం ద్వారా కండ్లకు కట్టినట్టు వివరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రాజెక్టును సందర్శించారు.
ఉమ్మడి జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగేంధర్, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రనాయక్, నోముల భగత్, నలమోతు భాస్కర్‌రావు, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నాయకులు బూడిద భిక్షమయ్య గౌడ్, కంచర్ల క్రిష్ణారెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మందడి సైదిరెడ్డి తరలివెళ్లి బరాజ్‌ను పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభత్వం బరాజ్ మరమ్మతుల విషయంలో తీ వ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ప్రజెంటేషన్‌ను జిల్లా ప్రజలు టీవీలు, సోషల్ మీడియాలో ఆసక్తిగా తిలకించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని అర్థం చేసుకున్నారు.
భువనగిరి,
కాళేశ్వర యాత్రకు జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికాయి. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం జిల్లా మీదుగానే బరాజ్ పరిశీలనకు వెళ్లగా భువనగిరిలో యాత్ర బస్సుకు పార్టీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. ఆలేరులోనూ యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఆలేరులో బస్సును నిలిపి పార్టీ కేడర్‌కు కేటీఆర్ అభివాదం చేశారు. అక్కడి నుంచి జనగామ జిల్లా మీదుగా కాళేశ్వర యాత్రకు వెళ్లారు.
మేడిగడ్డ సందర్శన సందర్భంగా బారేజీని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ కేవలం స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పంటలను ఎండబెడుతున్నదని దుయ్యబట్టారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో మూడు పిల్లర్లు కుంగితే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సిందిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో పాపం చేసినట్లు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ తన నైజాన్ని చాటుకుంటున్నదని విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని మేడిగడ్డ బారీజీకి మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.