హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
రామగిరి, జనవరి 1 : ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంబురాలు బుధవారం అంబరాన్నంటేలా సాగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఆనందోత్సాహంగా వేడుకలు జరుపుకొన్నారు. కేకులు కట్ చేసి, స్వీట్లు తినిపించుకొని ఒకరికొకరు ఆత్మీయంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
కొత్త సంవత్సరంలో ఏడాదంతా మంచే జరుగాలని కోరుతూ జనం తమ ఇష్ట దైవాలను వేడుకొన్నారు. ఇక వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో స్నేహితులు, బంధువులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్‌లు, పోస్టులు వెల్లువెత్తాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మహిళలు ఇంటి ముంగిళ్లను ముగ్గులు, రంగులతో అలంకరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రజలు, అభిమానులు కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.