సూర్యాపేట, మార్చి 15 (నమస్తే తెలంగాణ)/భువనగిరి అర్బన్ : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెన్షన్ చేయడంపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. మూడో రోజైన శనివారమూ ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఊరూవాడ ర్యాలీలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి. సూర్యాపేట జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చారు. భారీ బైక్ ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వరకు వచ్చి బాబాసాహెబ్‌కు పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ దళిత స్పీకర్‌ను అవమానించారనే నెపంతో ప్రశ్నించే గళాన్ని నొక్కేయడం దుర్మార్గమన్నారు. పదేండ్లు మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దళితుల అభ్యున్నతికి ఎంతో చేశారని గుర్తుచేశారు. ఆత్మకూర్.ఎస్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. మండల కేంద్రంలో రాస్తారోకో చేయడంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సూర్యాపేట, పెన్‌పహాడ్ మండలాల్లోని ప్రతి ఊళ్లోనూ బీఆర్ఎస్ నాయకులు రోడ్లపైకి వచ్చి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెన్‌పహాడ్ మండల కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మద్దిరాల మండలం కేంద్రంలో సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రమైన భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీసి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతులు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెషన్ విధించడం దుర్మార్గమని చింతల మండిపడ్డారు.
రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, భువనగిరి పీఏసీఎస్ మాజీ చైర్మన్లు నోముల పరమేశ్వర్‌రెడ్డి, ఎడ్ల సత్తిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు తదితరులు పాల్గొన్నారు. బీబీనగర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఆత్మకూర్.ఎం మండల కేంద్రంలోని మోత్కూర్ భువనగిరి ప్రధాన రహదాపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. బొమ్మలరామారంలోనూ రాస్తారోకో చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మెయిన్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రామన్నపేటలో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఇకనైనా ఇలాంటి కుట్రపూరిత ధోరణులు మానుకోకుటే సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని నిరసనల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
భగ్గుమన్న సూర్యాపేట ప్రజానీకం
జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజవకర్గం మొత్తంగా నిరసనలు వెలువెత్తాయి. ఊరూరా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. నియోజకవర్గ కేంద్రమైన సూర్యాపేటతోపాటు నాలుగు మండలాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య రెండు గంట వ్యవధిలోనే బీఆర్ఎస్ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు సైతం పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా 60కి పైనే నిరసనలు జరిగాయి. తమ ఆత్మీయ నేత జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ర్యాలీలు, రాస్తాకోలు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు.