సూర్యాపేట టౌన్, మార్చి 29 : సమాజంలో ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకునేలా రాష్ట్రంలో ఇఫ్తార్ విందులను బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిందని, ప్రతి రంజాన్ సమయంలో అది కొనసాగుతున్నదని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రంజాన్‌ను పురస్కరించుకొని శనివారం స్థానిక సుమంగళి ఫంక్షన్హాల్లో ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకునే సంప్రదాయానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాంది పలికారన్నారు. ఈ సంస్కృతిని ప్రజలకు అలవాటు చేయాలని మొదటగా ప్రభుత్వమే అది ఆచరించాలని నాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇఫ్తార్ విడుదలను ఏర్పాటు చేసేలా జీఓ జారీ చేశారని గుర్తు చేశారు. అలా పట్టణాలు, గ్రామాల్లో ఇఫ్తార్ విందులు ప్రారంభమయ్యాయన్నారు. దేశంలో ఇఫ్తార్ విందులను ప్రారంభించిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు.
గాంధీజీ చెప్పిన గంగ జమున తెహజీబ్ సంస్కృతిని తెలంగాణలో ఆచరణలో చూపించిన ఘనుడు కేసీఆర్ అని కొనియాడారు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఆనందోత్సాహాల నడుమ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ కౌన్సిలర్ షేక్ బాషామియా, ఎస్కే తాహేర్, మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రియాజుద్దీన్, సయ్యద్ సలీం, బత్తుల రమేశ్, జలీల్‌పాషా, షకీల్, కరాటే సయ్యద్, ఎస్కే రఫీ పాల్గొన్నారు.