తుంగతుర్తి, అక్టోబర్ 09 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ప్రజలకు 6 గ్యారంటీలతో కూడిన బాకీ కార్డులను పంపిణీ చేయాలని కోరారు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను అబద్ధపు వాగ్దానాలతో మోసం చేసి గద్దెనెక్కిందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ పాలనని కోరుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలన్నా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులుగా గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములు గౌడ్, గోపాల్ రెడ్డి, దొంగరి శ్రీనివాస్, మట్టపల్లి శ్రీశైలం, తునికి సాయిలు, దుర్గయ్య పాల్గొన్నారు.
Thungathurthy : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్