విద్యుత్ చార్జీలను పెంచాలని చూసిన కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలపై బిల్లుల భారం పడకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు బీఆర్ఎస్ వాదనలు వినిపించి చార్జీల పెంపు యత్నాన్ని అడ్డుకోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు జరిగాయి. పలుచోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలకు బీఆర్ఎస్ శ్రేణులు క్షీరాభిషేకం చేశాయి. పటాకాలు కాల్చి సంతోషం పంచుకున్నాయి. సూర్యాపేట జిల్లాకేంద్రంలోమాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, దేవరకొండలో మాజీ ఎమెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పాల్గొనారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎన్నడూ విద్యుత్ చార్జీలు పెంచలేదని, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ జనం జేబులు కొల్లగొట్టాలన చూస్తున్నదని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలను పెంచాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనలకు బీఆర్ఎస్ తరఫున మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అడ్డుకట్ట వేసి వారి ప్రయత్నాలను భగ్నం చేశారన్నారు. మఠంపల్లిలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎన్నడూ విద్యుత్ చార్జీలు పెంచలేదని, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ మరింత భారం మోపాలని చూస్తున్నదని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లాకేంద్రంతోపాటు ఆలేరు, అడ్డగూడూరులో పటకాలు కాల్చి సంబురాలు చేశారు.