కోదాడ, జూలై 28 : కోదాడ నియోజకవర్గం గంజాయి రవాణాకు, కల్తీ మద్యానికి అడ్డగా మారిందని.. దేవాలయాలు, మసీదు, ఇళ్ల మధ్యలోనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయీమ్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సైతం యువత గంజాయి వినియోగం పెరిగిందన్నారు. కోదాడ పట్టణంతో పాటు గ్రామాల్లో వందల బెల్ట్ షాపులు వెలిశాయని, అయినా ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. చివరకు దేవాలయాలు, మసీదులు, పాఠశాలల సమీపంలోనే బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. వీటిని నిలువరించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని, ఇప్పటికైనా చర్యలు తీసుకుపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
నియోజకవర్గంలో కల్తి మద్యాన్ని విక్రయించిన షాపులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అర్ధరాత్రి వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నప్పటికీ మామూళ్లకు అలవాటు పడిన పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మేళ్లచెరువు మండలం రామాపురంలో తయారవుతున్న కల్తీ మద్యం వెనుక పెద్దల హస్తం ఉందని, తక్షణమే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో నాయకులు పిట్టల భాగ్యమ్మ, మేదర లలిత, కర్ల సుందర్ బాబు, దొంగరి శ్రీనివాస్, ఉపేందర్ గౌడ్, మల్లయ్య గౌడ్, చలిగంటి వెంకట్, ఆరిఫ్, అబ్దుల్, అలీమ్, నరసయ్య, వెంకటనారాయణ, శ్రీను, రవికుమార్, సోమేశ్, గోపాలకృష్ణ యాదవ్, బడేమియా, నిస్సార్ పాల్గొన్నారు.
Kodada : కోదాడ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా