యాదాద్రి భువనగిరి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని, కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్లు ఎత్తి పోస్తే చెరువులు నిండేవని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. రైతులపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదని, సాగు జలాలు ఇవ్వడానికి మనస్సు ఒప్పడం లేదన్నారు. ఆదివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కన్నెపల్లి పంపుహౌస్‌ను పరిశీలించేందుకు వెళ్తున్న కేటీఆర్ ను అడుగడుగునా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ధర్మ పోరాటం చేస్తోందని, రేవంత్ సరార్‌పై రాష్ట్ర ప్రజలు తినగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అమలు కాని హామీలు, అసత్య మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి నోరు తెరిస్తే బూతు పురాణమే తప్ప అభివృద్ధి, సంక్షేమంపై ధ్యాసే లేదన్నారు. రాష్ట్రంలో అన్నదాతలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. రుణమాఫీ హామీ ఇప్పటికీ అమలు కాలేదని, పంటలకు కనీస మద్దతు ధర అందడం లేదన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రైతులకు యూరియా ఇవ్వడానికి యాప్‌లు ఎందుకని, యాప్ ద్వారా రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ట్రస్టు బోర్డులో స్థానికులకు అవకాశం కల్పించకుండా అవమాన పరిచారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రభుత్వం లోనూ తామే పెద్ద నాయకులమని చెప్పుకునే నేతలు ఏమయ్యారని నిలదీశారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు ఉన్నా కనీసం స్థానికులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతున్నారని, రాష్ట్ర కాంగ్రెస్‌ను సైకిల్ కాంగ్రెస్‌గా మార్చారన్నారు. ఫార్మా కంపెనీ యాజమాన్యాల వద్ద కోట్లాది రూపాయలు తీసుకొని, పాలకమండలిని అమ్ముకున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తదితరులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పాలకమండలి పునఃనిర్మాణం చేపట్టి స్థానికులకు అవకాశం కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఆలయ పునః నిర్మాణంలో భాగంగా ఎంతోమంది రైతులు తమ భూములు, ఇండ్లు కోల్పోయారని, వారికి పాలక మండలిలో అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. పాలకమండలి నియామకంపై బీర్ల అయిలయ్య మాట్లాడకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయానికి సంబంధంలేని, ఆధ్యాత్మిక భావాలు లేని, స్థానిక సమస్యలు తెలియని వాళ్లను పాలకమండలిలో చేర్చడంపై మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, నాయకులు బీరు మల్లయ్య, అతికం లక్ష్మీనారాయణ గౌడ్, సుధాకర్, జడల యశిల్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.