నల్లగొండ, జూన్ 08 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మూడవ విడతగా 06, 07, 08, 09, 10, 18, 19, 20, 38, 39, 40 అలాగే 42 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించబడ్డాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వార్డు స్థాయిలోనే పరిష్కార చర్యలు చేపట్టడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే ఈ వార్డు సభల ప్రధాన ఉద్దేశ్యమని మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర తెలిపారు. వార్డు సభల సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026, ఫోర్-వే వేస్ట్ సెగ్రిగేషన్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక సంరక్షణ చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. పరిశుభ్రమైన నగర నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు.
అదేవిధంగా “జల్ సంచయ్ – జల్ భాగీధారి” కార్యక్రమం కింద వర్షపు నీటి సంరక్షణ చర్యలు, ఇంకుడు గుంతల ఏర్పాటు, రూఫ్‌టాప్ రైన్వాటర్ హార్వెస్టింగ్ ప్రాముఖ్యతపై వివరించారు. భూగర్భ జలాలను పరిరక్షించేందుకు ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల పూడికతీత, మురుగు కాలువల శుభ్రత, వర్షపు నీటి పారుదల వ్యవస్థల నిర్వహణ, నీటి నిల్వలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి నివారణకు ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నగరంలో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల సంరక్షణ, రహదారుల అభివృద్ధి, హరితహారం, మొక్కల పెంపకం మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. సీజనల్ వ్యాధుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సురక్షితమైన తాగునీటి వినియోగం అవసరమని తెలిపారు.
వార్డు సభలలో ప్రజల నుండి తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీలు, రహదారులు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి, వర్షపు నీటి పారుదల, ప్రజా సౌకర్యాలు, ఇతర స్థానిక సమస్యలపై వినతులు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజల ఉద్యమంగా మార్చి, నగర అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. రాబోయే చివరి విడత వార్డు సభలకు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

వార్డు సభలతో ప్రజల వద్దకే పాలన : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర