రామగిరి, మార్చి 30 : ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, అయితే ఆ దిశగా నూతన పరిశోధనలపై దృష్టి సారించడంతో పాటు సబ్జెక్టుపై పట్టు సాధించాలని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూ సైన్స్ కళాశాల కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం వర్సిటీలోని ఆ కళాశాల సెమినార్ హాల్లో ‘రీసెంట్ ఆడ్వాన్సెస్ ఇన్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ- 2028’ అనే అంశంపై నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. రసాయన శాస్త్ర విభాగంలో ఉన్నఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయ సదుపాయాలను విద్యార్థులు సమర్ధవంతంగా వినియోగించుకోవాలన్నారు. ఎంజీయూలో అత్యాధునిక ల్యాబోరేటిస్ అందుబాటులో ఉంచి విద్యనందిస్తున్నట్లు తెలిపారు.
వర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.వసంత మాట్లాడుతూ.. సదస్సు లక్ష్యాలు, ఇతర అంశాలపై వివరించారు. కెమిస్ట్రీ విభాగం హెచ్ఓడీ డా.ఎం.జ్యోతి ‘విద్యా, పరిశోధన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ముఖ్య వక్త ఉస్మానియా యూనివర్సిటీ ప్రొ.అహ్మద్ కమాల్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ.డి.రామాచారి తదితరులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సదస్సులో కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్స్ డా.వై.ప్రశాంతి, డా.దోమల రమేశ్, డా.ఆర్.రూపా, డా.ఎస్.కళ్యాణి, డా.ఏ.శ్రీధర్ రావు, తిరుపతయ్య. డా.జె. శంకరాచారి, డా.కె.అమరేందర్, అధ్యాపకులు పరిమళ, మహతి, ఆయేషా బేగం పాల్గొన్నారు.