– ఇంజినీరింగ్ అధికారులకు నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశం
నార్కెట్పల్లి, జనవరి 13 : బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటి వరకు అయిన పనులు, పెండింగ్ భూ సేకరణ, ఇప్పటి వరకు భూ సేకరణకు చేసిన చెల్లింపులు, ప్రాధాన్యత క్రమంలో చెల్లించాల్సిన చెల్లింపులు, ఇతర పెండింగ్ వివరాలన్నింటిని వెంటనే తనకు సమర్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నార్కెట్పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్, పంపు హౌస్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పర్యవేక్షక ఇంజినీర్ బద్రు ప్రాజెక్టు వివరాలను కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సతీష్ చంద్ర, డీఈలు పిచ్చయ్య, మారం శ్రీనివాస్ పాల్గొన్నారు.