– 14 మోటార్లు, 8 బోరు పైపులు, 3 బ్యాటరీలు, రూ.1.74 లక్షల నగదు నగదు స్వాధీనం
– నిందితులను రిమాండ్‌కు తరలింపు
కట్టంగూర్, ఆగస్టు 05 : వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, బ్యాటరీల దొంతనాలకు పాల్పడుతున్న నిందితులను కట్టంగూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ ఏఎస్పీ జి.రమేశ్ మంగళవారం కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో డీఎస్సీ శివరాంరెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, ఎస్ఐ మునుగోటి రవీందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాల వెల్లడించారు. నకిరేకల్ పట్టణానికి చెందిన ఎడ్ల సురేశ్, నాగిళ్ల ముత్తయ్య, గోపగాని రమేశ్, అవుల రాజాలు, నాగిళ్ల యల్లయ్య కట్టంగూర్ మండలం ఈదులూరులో గల డెయిరీ ఫామ్, అయిటిపాముల ఎస్ఎల్బీసీ కెనాల్‌తో పాటు శాలిగౌరారం మండలంలోని వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, జోరు పైపులు, బ్యాటరీలు, ఇతర వస్తువులను అపరించుకుపోయారు.
దొంగిలించిన సామగ్రిని విక్రయించేందుకు ట్రాలీ ఆటోలో నకిరేకల్ నుండి హైదరాబాద్‌కు బయల్దేరారు. పక్కా సమాచారంతో ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో వాహనాన్ని తనిఖీ చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాలు వెలుగులోకి వచ్చాయి. వారి వద్ద నుంచి 14 మోటార్లు, 33 జోరు వైపులు, 5 బ్యాటరీలు, ట్రాలీ ఆటో, రాగి వైర్లు, రెండు ప్యాన్లు రూ.1.74 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ రూ.13.61 లక్షలు ఉంటుందని తెలిపారు. దొంగలను పట్టుకున్న సీఐ కొండల్ రెడ్డి, ఎస్ ఐ రవీందర్, కానిస్టేబుల్ బండి గిరి. శంకర్, గంట శంకర్, మునాస సత్యనారాయణను ఏఎస్పీ రమేశ్, డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.