కోదాడ, జనవరి 24 : మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లోనే కోదాడ నియోజకవర్గంలో గూండా రాజ్యం వర్థిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. ఇటీవల కోదాడలో లాకప్ డెత్‌కు గురైన దళిత బిడ్డ రాజేష్ మృతికి నిరసనగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో కోదాడ’లో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మల్లయ్య యాదవ్ భావోద్వేగంతో మాట్లాడారు. దళిత బిడ్డ రాజేష్ లాకప్ డెత్‌కు గురై 68 రోజులు దాటినా ఇప్పటికీ బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయకపోవడం శోచనీయమన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోలీసుల చిత్రహింసలవల్లే రాజేష్ మరణించాడని ఆధారాలతో సహా నిరూపించినా అందుకు బాధ్యుడైన చిలుకూరు ఎస్సై సురేష్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని బొల్లం ప్రశ్నించారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుకనే సురేష్‌రెడ్డిని మంత్రి ఉత్తమ్ దంపతులు కాపాడుతున్నారని దుయ్యబట్టారు. రాజేష్ కుటుంబానికి న్యాయం చేయడం కన్నా ఎస్సై ఉద్యోగంలో కొనసాగటమే వారికి అవసరమా..! అని ప్రశ్నిస్తూ దళితుల ప్రాణాలంటే వారికి లెక్క లేదన్నారు. రాజేష్ మృతి విషయంలో విచారణ నుంచి పోస్టుమార్టం వరకు పారదర్శకంగా జరగలేదన్నారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసులో తన పేరు చెప్పాలని, రాజేష్‌పై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని మందకృష్ణ మాదిగ స్పష్టం చేసిన విషయాన్ని మల్లయ్య యాదవ్ గుర్తుచేశారు. కోదాడ సీఐ అధికార పార్టీకి ఏజెంటులా వ్యవహరిస్తూ పట్టణంలో ఇసుక, మద్యం, మట్టి మాఫియాతో సంబంధాలు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, భవిష్యత్తులో ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పోలీసుల చిత్రహింసలవల్ల మృతి చెందిన కర్ల రాజేష్ హత్యకు బాధ్యులైన ఎస్ఐని సస్పెండ్ చేయాలని, నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధికార పార్టీ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలపై చేస్తున్న దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో కోదాడ’ బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపింది. నియోజక వర్గంలోని ఆరు మండలాలతో పాటు కోదాడ పట్టణం నుంచి వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొనడం చూస్తుంటే రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమైంది. శనివారం ఉదయం 11 గంటల కల్లా పలు మండలాల్లోని గ్రామాల నుంచి వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు.
మునగాల మండలం నుంచి వందలాది మంది యువకులు ద్విచక్రవాహనాలపై భారీ ర్యాలీగా వచ్చారు. ఎన్నికల ప్రచార రథంపై బొల్లం మల్ల య్య యాదవ్‌తో పాటు, పార్టీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది. డీజే పాటలతో ఇనుమడించిన ఉత్సాహంతో యువకులు జై కేసీఆర్.. జై కేటీఆర్.. జై మల్లన్న అంటూ నినాదాలు చేస్తూ నృత్యం చేశారు. ఖమ్మం క్రాస్ రోడ్డు నుంచి బయలుదేరిన ర్యాలీ తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు రాగానే వారు ప్రచార రథం దిగి విగ్రహానికి పూలమాలలు వేశారు.
అనంతరం ర్యాలీ బస్టాండ్ వరకు సాగింది.. ఎన్నికల రథంపై నుంచి బొల్లం మల్లయ్య యాదవ్.. దళిత బిడ్డ రాజేష్ మృతికి పోలీసులు చిత్రహింసలే కారణమని, ఇకనుంచి పార్టీ కార్యకర్తలు జోలికొస్తే సహించేది లేదని, అక్రమ కేసులు బనాయిస్తే సహించబోమని చేసిన హెచ్చరికలు, బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపాయి. దీంతో పాటు కక్ష సాధింపు కుట్రలో భాగంగా తన పేరు చెప్పమని కర్ల రాజేష్‌ను పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపారని, దీని వెనుక ఉత్తమ్ దంపతుల హస్తం ఉందంటూ బొల్లం మాట్లాడిన తీరు కార్యకర్తలను ఆలోచింపజేసింది.. కాగా కర్ల రాజేష్ తల్లి లలితమ్మ కన్నీటి పర్వంతమవుతూ తన బిడ్డకు జరిగిన అన్యాయం మరో తల్లికి జరగకూడదన్నారు. తన బిడ్డకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై వ్యంగ్యంగా చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.