మండలంలోని బొందుగుల గ్రామంలోని బొగుడ వేంకటేశ్వరాలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. స్వయంభువుగా వెలిసిన స్వామివారు కోరిన కోరికలు నెరవేర్చుతాడని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది సంక్రాంతికి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతి నుంచి ఉత్సవాలు
ఈ నెల 14 నుంచి 17 వరకు ఆలయ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. 14న ఆలయం ఆవరణలో బోగిమంటలు, స్వస్తి పుణ్యహవాచనం, ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15న అధ్యయనోత్సవం, పరమపదోత్సవం, ఎడ్ల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్ల ఊరేగింపు.. 16న స్వామి వారి కల్యాణోత్సవం, రథోత్సవం నిర్వహిస్తారు. 17న చక్రతీర్థంతో వేడుకలు ముగుస్తాయి.
తీసిన కొద్దీ పెరిగే పుట్ట
బొగుడ వేంకటేశ్వరాలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. స్వయంభువుగా స్వామి వారు వెలిశారు. గర్భాలయంలో పుట్ట వెలుస్తుందని, పుట్టమట్టిని తీస్తున్న కొద్దీ మళ్లీ పెరుగుట ఇక్కడ విశిష్టత. గ్రామస్తులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో పునరుద్ధరించారు. సంక్రాంతికి జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారు. బ్రహోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నామని, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు