నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ)/నల్లగొండ రూరల్ : నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. అందుకు జిల్లా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక కారణమైంది. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ నాగం వర్షిత్రెడ్డినే మరోసారి ఎన్నుకున్నారు. కిందటి సారి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన వర్షిత్‌రెడ్డిని మరోసారి పూర్తి కాలం అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ ఆదివారం రాత్రి ప్రకటించారు. దీంతో నాగం వర్గీయులు సంబురాల్లో మునిగితేలారు. కానీ నాగం వర్షిత్‌రెడ్డి ఎన్నికపై జిల్లా బీజేపీలో ముసలం పుట్టింది. వర్షిత్‌రెడ్డి ఎన్నిక పూర్తిగా అసంబద్ధమని, నిబంధనలకు విరుద్ధమంటూ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వీరంతా మంతనాలు జరిపి వర్షిత్‌రెడ్డి ఎన్నిక రద్దు చేయాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. బీజేపీ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
నాగంను అంగీకరించం
జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్‌రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని మరోవర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై వీరంతా అసమ్మతి సమావేశం ఏర్పాటు చేశారు. నల్లగొండలోని బీజేపీ సీనియర్ నేత బండారు ప్రసాద్ ఇంట్లో కూర్చుని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పార్టీ భవిష్యత్తును ఫణంగా పెట్టి అధ్యక్షుడిని ఎన్నిక చేయడం సరికాదని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. సా యంత్రం మీడియా ముందుకు సైతం వచ్చి అధ్యక్షుడిగా నాగం వర్షిత్‌రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో నూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం అధ్యక్షుని ఎన్నికపై పునరాలోచన చేయకపోతే తమ దారి తాము చూసుకుంటామని కూడా బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ సీనియర్ నేతలు బండారు ప్రసాద్, పోతేపాక సాంబయ్య, కంకణాల నాగిరెడ్డి, దాసరి సాయి, వంగూరి రాఖీ, గుర్రం వెంకన్న, రావిరాల వెంకటేశ్వర్లు, గడ్డం వెంకట్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నో ఏండ్లుగా బీజేపీలో ఎంతో క్రమ శిక్షణ గల నాయకులుగా తాము ఎదిగామని గుర్తు చేశారు. గత 11 నెలలుగా జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్‌రెడ్డి పనితీరును చూశామని, నిజమైన కార్యకర్తలను అవమాన పరిచే విధంగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గారడి మాటా లు ..నిత్యం అబద్ధాలతో పబ్బం గడిపాడంటూ కేంద్ర పార్టీ నిబంధనల ప్రకా రం జిల్లా అధ్యక్ష పదవి 45 ఏండ్ల నుం చి 60 ఏండ్లలోపు వాళ్లే అర్హులన్నారు.
అదే విధంగా రెండు సార్లు క్రీయశీల సభ్యత్వం ఉంటేనే ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటీకి రాష్ట్ర నాయకత్వం వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఎన్నిక చేసిందని మండిపడ్డారు. వర్షిత్‌రెడ్డికి కాకుండా ఎవ్వరికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. కనీసం బూత్ కమిటీలు వేయలేని అధ్యక్షుడికి మళ్లీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర పార్టీ నేతలు ప్రస్తుతం ఏమి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇరువర్గాలను కూర్చోబెట్టి సయోధ్య కుదురుస్తారా లేదా అధ్యక్షుడి ఎన్నిక రద్దు చేసి కొత్త అధ్యక్షుడి నియామకం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.