నల్లగొండ ప్రతినిధి, మార్చి11 (నమస్తే తెలంగాణ) : హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. సైదిరెడ్డి చేరికపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వద్దని పార్టీ హై కమాండ్‌ను హెచ్చరిస్తున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలు, మనోభావాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఎన్నికల్లో సహాయ నిరాకరణ తప్పదని స్పష్టం చేశారు.
ఈ మేరకు సోమవారం ఆ పార్టీ జిల్లా ముఖ్య నేతలు రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి గోడును వెళ్లబోసుకున్నారు. గంగిడి మనోహర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, గార్లపాటి జితేందర్‌కుమార్, బొబ్బ భాగ్యరెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర కార్యాలయంలోని బీజేపీ పెద్దలను కలిశారు. పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ ఎదుట తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సైదిరెడ్డి బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించారని వివరించారు. ఈ సందర్భంగా గుర్రంబోడు భూముల విషయంలో జరిగిన వివాదం తాలూకు వీడియోలను, ఫొటోలను తివారీకి చూపించారు.
సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని తాము ముందే అభ్యంతరం తెలిపినట్లు గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో శానంపూడికి ఎంపీ టికెట్ ఇస్తే తామంతా సహాయ నిరాకరణ చేస్తామని స్పష్టం చేసినట్లు తెలిపారు. పార్టీ కోసం ఆది నుంచి పని చేస్తున్న నేతల్లో అర్హులైన వారికే టికెట్ దక్కేలా చూడాలని కోరారు. ఆ విషయాలన్నీ నోట్ చేసుకున్న చంద్రశేఖర్ తివారీ పార్టీ జాతీయ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు జిల్లా నేతలు తెలిపారు.