మోత్కూరు, నవంబర్ 27 : రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం మోత్కూరులో జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కంచె చేను మేసినట్లుగా ప్రధాని మోదీ న్యాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కిందన్నారు.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తూ, భారత్‌ను మతతత్వ దేశంగా మార్చి ఎర్రకోటపై త్రివర్ణ పతాకం బదులుగా కాశాయ జెండాను ఎగుర వేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీని హత్య చేసిన గాడ్సేకే బీజేపీ గుడి కడుతున్నదని, ఇదేమిటని ప్రశ్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ పేరుతో ప్రజలపై పెనుభారం మోపుతున్నదని విమర్శించారు. రాష్ర్టాల హక్కులను హరించి వేస్తున్నదన్నారు.
ఉచిత, సంక్షేమ పథకాలు దేశానికి నష్టదాయమని చెబుతూ.. పెట్టుబడిదారులు రూ.12లక్షల కోట్ల రుణాలు ఎగవేస్తే ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తున్నదని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ఎత్తేసేందుకు కుట్ర పన్నుతున్నదన్నారు. రాజ్యంగం గురిచి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహాసభలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్, జిల్లా సహాయ కార్యదర్శి జి. సైదులు, రాములమ్మ, స్వరూప, కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, పెంటయ్య పాల్గొన్నారు.