మోత్కూరు, మే 13 : మోత్కూరు మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పన్నులను వసూలు చేసి బిల్ కలెక్టర్లు సొంతానికి వాడుకుంటున్నారు. రసీదులను మున్సిపల్ కార్యాలయంలో అప్పగించకుండా, వసూలు చేసిన పన్ను డబ్బులను చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడం, మున్సిపల్ పాలకవర్గం పాలన ముగియడం, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బిల్ కలెక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీలో పని చేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్లు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు కాజేసినట్లు తెలుస్తున్నది. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న మాదిరిగానే మున్సిపల్ పాలనలో ఉంటుందని భావించి వారు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.
మోత్కూరు మున్సిపాలిటీలో పని చేస్తున్న కొందరు వాటర్ పంపు డ్రైవర్లు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో బిల్ కలెక్టర్ల హోదాలో కొంత కాలంగా పని చేస్తున్నారు. వీరు 2021 జూన్-జూలై నుంచి పురపాలిక పరిధిలో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, వర్తక, వ్యాపార షాపుల లైసెన్స్ రెన్యూవల్స్‌ను నిర్వహిస్తున్నారు. వసూలు చేసిన పన్నులను ఏ రోజుకారోజు ప్రభుత్వ ఖజానాలో జమ చేసి లెక్కలను చూపాల్సి ఉంది. ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం మారడం, కొత ప్రభుత్వం ఏర్పడటం, ఆ తర్వాత పురపాలిక చైరపర్సన్పై అవిశ్వాసం పెట్టి కొత్త చైరపర్సన్ ఎన్నిక కావడం, ఆ తర్వాత ఏడాదిలోనే వారి పాలన ముగిసి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో పురపాలిక కమిషనర్ కె.సతీశ్‌కుమార్ కొత్తగా బాధ్యతలు చేపట్టడం, గతంలో ఇక్కడ పని చేసిన ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ పదోన్నతిపై బదిలీ కావడంతో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఏండ్ల తరబడిగా ఇక్కడే పని చేస్తున్న పంపు డ్రైవర్లు, బిల్లు కలెక్టర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వసూ లు చేసిన పన్నుల లెక్కలను చూపకుండా అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
మున్సిపాలిటీ పరిధిలో పట్టణంతో పాటు కొండగడప, బుజిలాపురం, ధర్మాపురం, రాజన్నగూడెం, కొండాపురం, జామచెట్లబావి, ఆరెగూడెం గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న నివాసదారుల నుంచి పద్దు వారీగా ముక్కుపిండి వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా స్వాహా చేసి, రసీదు బుక్కులను కార్యాలయంలో అప్పగించడం లేదన్న ఆరోపణలున్నాయి. వసూలు చేసిన పన్నులను కూడా జమ చేయకుండా, కార్యాలయంలో రసీదు బుక్కులను అప్పగించక పోవడంపై ఇటీవల కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ వారిని తీవ్రంగా మందలించినట్లు తెలుస్తున్నది. అయినా వారిలో మార్పు రాక పోవడం, వసూలు చేసిన పన్నుల లెక్కలను చూపెట్టకుండా ఉన్న బిల్లు కలెక్టర్లను సిబ్బంది సమీక్షలోనూ ఆదేశించారు. వార్డు ఆఫీసర్లుగా పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమన్వయంతో పలు పన్నులను వసూలు కోసం ప్రణాళికలు చేశారు. అయినా వార్డు ఆఫీసర్లు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించి పర్యవేక్షణను పట్టించుకోక పోవడంతో ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న సిబ్బంది ఇష్టారాజ్యం పెరిగిపోయింది. అందిన కాడికి వారు పన్నుల పేరిట వసూలు చేసి కాజేశారు.
ప్రభుత్వం గత మార్చి 31వ తేదీ లోపు పన్నులు చెల్లింపు చేసిన వారికి పెద్ద మొత్తంలో రిబేట్ కల్పించింది. దీంతో ఎక్కువ మంది తమ పన్నులను చెల్లించారు. జిల్లాలోనే మోత్కూరు మున్సిపాలిటీ ఉత్తమ అవార్డును సైతం కైవసం చేసుకుంది. కానీ వసూలు చేసిన పన్నులు పూర్తిగా ప్రభుత్వ ఖజానాకు జమ కాలేదు. మున్సిపాలిటీలో పని చేస్తున్న ఎనిమిది మంది బిల్ కలెక్టర్లు రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు సొంతానికి వాడుకొని లెక్కలు చెప్పలేదని తెలుస్తున్నది. మున్సిపల్ కమిషనర్ సతీశ్‌కుమార్ తన కుమార్తెకు సర్జరీ కావడంతో 15 రోజులు సెలవుపై వెళ్లారు. దీనిపై వివరణ అడిగేందుకు ఆయన్ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. పన్నుల వసూళ్లపై తమకేమీ తెలియదని, కమిషనర్ సతీశ్కుమార్కే తెలుసని మున్సిపాలిటీ మేనేజర్ ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి సిబ్బంది పనితీరు, బిల్లు కలెక్టర్ల అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.