అనంతగిరి, ఏప్రిల్ 21 : భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ ఎస్డబ్లయూసీ గోదాం నందు భూ భారతి చట్టం 2025 పై అవగాహన సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. మండల స్థాయిలో ప్రజలకి చట్టంపై అవగాహన తెచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా అధికారం వికేంద్రీకరణ జరుగుతుందని, సమస్యని బట్టి తాసీల్దరా్, ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలో పరిష్కరించవచ్చు అన్నారు. గ్రామ స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ పరిపాలన అధికారిని ప్రభుత్వం త్వరలో నియమించనుందని చెప్పారు.
2014 జూన్ 2కి ముందు సాదా కాగితం, స్టాంప్ పేపర్‌పై కొనుగోలు చేసి 12 సంవత్సరాలు సాగులో ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా ధరఖాస్తులు పరిశీలించి వాటిని పట్టాదార్ పాస్ బుక్ నందు అప్డేట్ చేస్తామని తెలిపారు. వారసత్వం /పౌతి అమలు చేసేటప్పుడు కుటుంబ సభ్యులందరికి గ్రామ పంచాయతీలో నోటీసులు ఇచ్చి వారం రోజులు గడువు ఇస్తామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చు అన్నారు. అలాగే పౌతి అమలు అయినా తర్వాత కూడా మార్పులకి అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి ప్రతి రైతుకి 1బి అందజేస్తామని ఏమైనా తప్పులు ఉంటే సరి చేస్తామని తెలిపారు.
విస్తీర్ణంలో మార్పులు, మిస్సింగ్ సర్వే నంబర్, సవరణలు లాంటి ప్రతి సమస్యకి మీ సేవ ద్వారా కాకుండా స్వయంగా దరఖాస్తు చేసుకునేలా భూ భారతి పోర్టల్ రూపొందించినట్లు తెలిపారు. ప్రతి వ్యక్తి ఆధార్ ఉన్నట్లుగా ప్రతి భూమికి భూదార్ అనే యూనిక్ నంబర్ ఇచ్చి సరిహద్దులు నిర్ణయించి సర్వే మ్యాప్ ని భూ భారతి పోర్టల్ లో అప్డేట్ చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజులలో భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేస్తారని తెలిపారు. అనంతరం ఆర్డీఓ సూర్యనారాయణ సెక్షన్ల వారీగా భూ భారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తాసీ0ల్దార్ హిమబిందు, ఎంపీడీఓ రామచంద్ర రావు, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ జడ్పిటిసి ఉమా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.