గుర్రంపోడ్,జులై 25: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేద ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని చామలేడు గ్రామంలో అర్హులై ఉండీ ఇండ్లు మంజూరు కాని గుడిసెలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఇండ్లు మంజూరు కాని వారి జాబితాతో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్యక్షుడు నాగులవంచ తిరుపతి రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు గత రెండు వారాలుగా తిరుగుతున్నారన్నారు. గుర్రంపోడ్ మండలంలో అర్హత ఉండి ఇందిరమ్మ ఇండ్లు రాని నిరుపేదలు 150 మంది వరకు ఉన్నారని అన్నారు. ‘సంక్షేమ పథకాలు అమలు చేసినం.. ప్రజలంతా సంతోషంగా ఉన్నారనడం’ ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు రాలేదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కలెక్టర్‌కు, స్థానిక ఎమ్మెల్యేకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్షాన లేఖలు రాస్తామని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నాట్లు నాట్లకు మధ్య రైతుబంధు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు.. ఓట్లకు మధ్య రైతుబంధు వేస్తోందన్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు గతంలో తాము అవలంబిస్తే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి కూడాకార్యకర్తలు భయపడేవారన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పేట్టిన సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు నీళ్లకోసం ప్రజలు బిందెలతో కిలోమీటర్ల మేర వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బిందెలతో కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. గ్రామాల్లోని జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, మాజీ కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు, నాయకులు షేక్ సిరాజ్, కామళ్ల రాములు, వెంకటయ్య, దోటి గణేశ్, పగిడిమర్రి వెంకటేశం, శంకర్, మారం గోపాల్‌రెడ్డి, శ్రీను, గిరి, రవీందర్‌రెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.