శాలిగౌరారం, జూన్ 19 : కేసీఆర్ ప్రభుత్వం రైతుల మేలు కోరి నాట్లకు నాట్లకు మధ్యన రైతు బంధు డబ్బులను ఖాతాలో జమ చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లకు ఓట్లకు మధ్యన రైతు భరోసా పేరుతో రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని శాలిగౌరారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వేమిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుతో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే సత్తా లేక ఓట్ల కోసం రేవంత్ సర్కార్ కొత్త నాటకం ఆడుతుందని విమర్శించారు.
రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి కేసీఆర్ చూపిన బాటలోనే ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెల్లదీస్తుందన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు ఇస్తామని చెప్పి నేటికి వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. రైతు భరోసా వేయడం కూడా ఎన్నికల స్టంట్లో భాగమేనని పేర్కొన్నారు.