నిడమనూరు, జూన్ 2 : ప్రజలకు మెరుగైన న్యాయసేవలు అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి సుజోయ్‌పాల్ అన్నారు. నిడమనూరు మండల కేంద్రంలో రూ.5.50 కోట్లతో నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన సముదాయం, జడ్జి నివాస గృహాన్ని హైకోర్టు పోర్టుఫోలియో న్యాయమూర్తి టీ వినోద్ కుమార్, న్యాయమూర్తులు శ్రీసుధ, కె.సుజన, రాధారాణితో కలిసి సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు సహకరించి ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం కల్గించాలని సూచించారు. పక్కాభవన నిర్మాణంతో ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువవుతాయన్నారు.
నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా నిడమనూరు బార్ అసోసియేషన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిడమనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంసీ కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా న్యాయవాదులు సేవలు కొనసాగించాలని సూచించారు. అనంతరం ఆయనను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సంపూర్ణానంద్, మిర్యాలగూడ ఐదో అదనపు జిల్లా జడ్జి వేణు, నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్చార్జి పవన్‌కుమార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అదనపు ఎస్పీ రమేశ్, తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉన్నం చిన్నవీరయ్య, న్యాయవాదులు పాల్గొన్నారు.