నల్లగొండ, జనవరి 13 : సన్న బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కొత్త బియ్యం క్వింటా రూ.5వేల నుంచి రూ.5,500 పలుకుతుండగా, పాతవి(గత వానాకాలం) కావాలంటే క్వింటాకు రూ.6,200 నుండి రూ.7వేల వరకు పెట్టాల్సి వస్తున్నది. గత సీజన్‌తో చూస్తే ప్రస్తుతం క్వింటాకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 ధర పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలలకు నెలలు దాటవేస్తూ.. హామీని అమలు చేయకపోవడంపై మండిపడుతున్నారు.
ప్రభుత్వాలు ప్రతి నెలా రేషన్ ద్వారా దొడ్డు బియ్యం ఇస్తున్నప్పటికీ కాలానుగుణంగా చాలా వరకు పేద, మధ్యతరగతి కుటుంబాలు కూడా సన్న బియ్యం అలవాటుగా మార్చుకున్నారు. అంతోఇంతో వ్యవసాయం ఉన్న కుటుంబాలు వారు తిండి గింజల వరకు సన్న వడ్లు పెట్టుకుని మిగతా దొడ్డురకం పండించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. వ్యవసాయ భూమి లేని వారు మాత్రం సన్నం బియ్యం కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఏటా వానకాలం సీజన్లో సన్న బియ్యం సాగు ఎక్కువగా అవుతుంది. అదే సమయంలో ఎక్కువ మంది బియ్యం కొనుగోలు చేస్తారు. ఈసారి ధరలు ఆకాశానికి అంటుతుండడంతో కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. గత యాసంగిలో వరి సాగు 25 శాతం మాత్రమే కాగా. వానకాలంలో సాగైనా బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. గత వానకాలం సీజన్‌కు సంబంధించినవి సన్నం బియ్యం ఆరు నెలల కిందట క్వింటా రూ.4వేలు ఉండగా, ప్రస్తుతం రూ.6,500కి చేరింది.
ప్రస్తుతం వానకాలం సీజన్ పూర్తికాగా కొత్త బియ్యం మిల్లుల్లో, మార్కెట్లో లభ్యమైతున్నప్పటికీ ధరలు మాత్రం విపరీతంగా చెబుతున్నారు. కొత్తవి(ఈ వానకాలం సీజన్వి) క్వింటా రూ.5 వేల నుండి రూ.5,500 వరకు పలుకుతుండగా, పాతవి(గత వాన కాలానివి) రూ.6,200 నుంచి రూ.7వేల వరకు ఉన్నాయి. బీపీటీ రూ.5వేలకు పైగా. చిట్టిపొట్టి చింట్లు వంటి వెరైటీలు రూ.7వేల దాకా ధర నడుస్తున్నది. మరోవైపు క్వాలిటీ బియ్యాన్ని మిల్లర్లు స్థానికంగా విక్రయించకుండా హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తున్నది.
సర్కారు సన్న బియ్యం కోసం ఎదురు చూపులు..
తామ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఏడాది దాటినా అదిగో.. ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నదే తప్ప హామీ అమలుపై దృష్టి పెట్టింది లేదు. ప్రస్తుతం సన్న బియ్యం ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు సన్నం బియ్యం పంపిణీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. మరోవైపు ఈసారి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వానకాలం సీజన్లో సన్న ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ, ఆశించిన మేరకు ధాన్యం రాలేదు. నల్లగొండ జిల్లాలో ఈసారి 2.50లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనాలనే లక్ష్యంగా పెట్టుకున్నా.. సర్కారు పెట్టిన పెట్టిన తేమ శాతం కొర్రీతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో 70వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే వచ్చింది.
సన్న బియ్యం కొనే పరిస్థితి లేదు
సన్న బియ్యం ధరలు కిందటేడుకు, ఇప్పటికి బాగా పెరిగాయి. గతంలో క్వింటా ఐదు వేలు ఉన్న బియ్యం ఇప్పుడు రూ.6,500కి అమ్ముతున్నరు. ఈ సీజన్లో పండిన బియ్యానికి క్వింటా రూ.5వేలకు పైగా చెప్తున్నారు. మేము ఇదే సీజన్లో ఏడాదికి ఒకసారి కొంటుంటాం. ఈసారి మిల్లుకు పోతే వాళ్లు చెప్పిన ధరలు విని తల తిరిగింది.
-దొడ్డ నాగేశ్వర్ రావు, అలకాపురికాలనీ, నల్లగొండ
ప్రభుత్వం రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వాలి
మార్కెట్లో ఇప్పుడున్న ధరల్లో సన్న బియ్యం కొనే పరిస్థితి లేదు. అధికారంలోకి వస్తే రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నెరవేర్చాలి. వెంటనే తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా సన్న బియ్యం ఇవ్వాలి.
-బొజ్జ దేవయ్య, మర్రిగూడెం, నల్లగొండ