నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : కుల గణన నివేదికను తప్పుల తడకగా రూపొందించడంతోపాటు ఉద్దేశపూర్వకంగానే బీసీ జనాభాను తక్కువ చేసి చూపారని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సామాజికవేత్తలు మండి పడుతున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సర్వే గణంకాలపై క్షేత్రస్థాయిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఎన్నికల్లో చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కాకుండా పార్టీ పరంగా ఇస్తామనడం బీసీలను దగా చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం పరిధిలోకి రిజర్వేషన్ల అంశాన్ని నెట్టి చేతులు దులుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడడం తగదంటున్నారు. కుల గణనలో దొర్లిన తప్పులను సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించకుండా కుంటి సాకులు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాల జనాభా పెరిగి కేవలం బీసీ జనాభా మాత్రమే తగ్గడం అంటే.. ఏదో మతలబు దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి 100 తప్పులకు పాల్పడుతున్నదని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం పట్ల ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఆయా సంఘాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల కులగణన నివేదికలను దగ్గం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్వంలో సమావేశమై ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. కుల గణన సర్వేను అసమగ్రంగా చేపట్టి బీసీకు అన్యాయం చేస్తున్నారని, తక్షణమే సమగ్ర సర్వే చేపట్టి వాస్తవమైన బీసీ జనాభాను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రానున్న కాలంలో ప్రభుత్వంపై బీసీలంతా ఉప్పెనలా విరుచుకుపడుతామని హెచ్చరిస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 56 శాతం ఉన్న బీసీల జనాభా ఇప్పుడు 46శాతానికి ఎలా తగ్గుతుంది. బీసీలను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సర్వే చేయించింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేకి. బీసీల ఎదుగుదలను ఎన్నడూ కూడా జీర్ణించుకోలేదు. కులగణన పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు ఏడాది పాటు డ్రా మాలు ఆడింది. అగ్రకులాలను ఎక్కువ చూపించేందుకే కుల సర్వేను వాడుకున్నది. తప్పుల తడకగా ఉన్న కుల గణన మాకొద్దు. బీసీల పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో బుద్ధి చెప్తాం.
– అయిలీ లక్ష్మీనర్సింహ గౌడ్, తమ్మడపల్లి మాజీ సర్పంచ్, మర్రిగూడ
కుల గణన సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే ఆమోదయోగ్యం కాదు. బీసీ, మైనార్టీలతో కలుపుకొని 62 శాతం ఉన్న బీసీ జనాభాను రాష్ట్ర ప్రభుత్వం 56 శాతంగా చూపుతూ అన్యాయం చేస్తున్నది. కుల గణన సర్వే పూర్తికాకుండానే కాంగ్రెస్ మంత్రులు లెక్కలు ప్రకటించడం అమానుమానాలను రేకెత్తిస్తున్నది. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రామా ఆడుతున్నది. ప్రజాపాలన పేరిట ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓట్లతో బుద్ధి చెప్పడం ఖాయం.
-రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్, నకిరేకల్
ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను కాపాడే క్రమంలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారు. ఇందులో బీసీ రిజర్వేషన్‌ను నీరు గార్చే కుట్ర దాగి ఉంది. 7శాతం ఉన్న ఓసీల సంఖ్యను రెట్టింపు చేసి చూపించి, బీసీ, ఎస్సీ, ఎస్టీల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపడం దుర్మార్గమైన చర్య. కుల గణన సర్వేలో జరిగిన తప్పులను సవరించి బీసీలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చూడాలి.
-పానగంటి విజయ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మునుగోడు
ప్రభుత్వం ప్రకటించిన కుల గణన బీసీలను అణచివేసే విధంగా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన కుల గణన సర్వేలో బీసీలను తగ్గించి చూపడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. బీసీ జనాభాను తక్కువగా చూపించడంతో వారి రాజకీయ హక్కులను దెబ్బతీసే విధంగా ఉంది. సర్వే ఫలితాలను వెంటనే సమీక్షించి పారదర్శకతతో నిజమైన గణాంకాలను వెల్లడించాలి.
– యర్కల మల్లేశ్ గౌడ్, జిల్లా బీసీ రాజ్యాధికార సమితి కో కన్వీనర్, కట్టంగూర్
రేవంత్‌రెడ్డి సర్కారు చేసిన బీసీ కులగణన అంతా ఒక బూటకం. అగ్రకులాల సంఖ్యను రెట్టింపుగా చూపేందుకే సర్వేను వాడుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఖ్యను గణనీయంగా తగ్గించడం హేయమైన చర్య. గత 10సంవత్సరాల నుంచి బీసీల సంఖ్య పెరుగకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. బీసీలను రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది. ప్రభుత్వం చేసిన నిర్వాకంతో బీసీలు సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి బీసీల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలి.
– చెర్కు లింగం గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మర్రిగూడ
కుల గణన తప్పుడు రిపోర్ట్‌తో బీసీల జనాభా శాతాన్ని తక్కువ చేసి రేవంత్‌రెడ్డి సర్కార్ బీసీలను మోసం చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీనే ఈ సర్వేను వ్యతిరేకించారు. బీసీలకు రిజర్వేషన్ల ఆశ చూపి ఇప్పుడు జనాభా శాతాన్ని తక్కువ చేసి చూపించారు. దీన్ని బట్టి బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి మాటలను ఇక బీసీలు నమ్మరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు.
– చిర్ర మల్లయ్యయాదవ్, మాజీ సర్పంచ్, వేములపల్లి
రాష్ట్రంలో నిర్వహించిన బీసీ కులగణన సర్వే పూర్తిగా బూటకం. 2014 సంవత్సరంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 51శాతంగా ఉన్న బీసీల సంఖ్యను ప్రస్తుతం ప్రభుత్వం 46శాతానికి కుదించింది. అగ్రకులాల సంఖ్యను రెట్టింపు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపడం హేయమైన చర్య. బీసీలంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదు.. రెడ్డి పాలన.
-జనిగల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, గరిడేపల్లి
ప్రభుత్వం చేపట్టిన కులగణన ఆధారంగా బీసీలకు పార్టీపరంగా రిజర్వేషన్లు ప్రకటించొద్దు. ప్రభుత్వ పరంగా చట్టబద్ధత కల్పించి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన విధంగా అమలు చేయాలి. అలా కాకుండా బీసీ కులగణన నివేదికను కేంద్రానికి పంపి వదిలేయడం సరికాదు. రిజర్వేషన్లు చట్టబద్ధత చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.
-పగిడి జీడయ్య యాదవ్..
కులగణన అంతా తప్పుల తడక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే అంతా తప్పుల తడకగా ఉంది. రాష్ట్రంలో 60శాతానికిపైగా ఉన్న బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం 46శాతంగా చూపెట్టి మోసం చేస్తున్నది. రేవంత్‌రెడ్డి సర్కారు కుల గణన సర్వేలో జరిగిన తప్పులను సవరించి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూడాలి.
-బొల్లెపెల్లి స్వామిగౌడ్, బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎన్జీ కొత్తపల్లి, శాలిగౌరారం మండలం