సూర్యాపేట, సెప్టెంబర్ 20: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం పితృ అమావాస్యతో ప్రా రంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలు, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఐక్యతతో ప్రశాంత వాతావరణం లో నిర్వహించుకోవాలని సూచించారు. ప్రకృతిని ఆరాధిస్తూ నిర్వహించుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణాలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించుకునేలా చేసిన ఘనత నాటి సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నాటి నుంచే బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఆడపడుచులకు పెద్దన్నగా.. బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసి తెలంగాణ మహిళలపై కేసీఆర్కున్న ఆదరాభిమానాలను చాటుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఏడాది ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలు అందించామన్నారు.
కాంగ్రెస్ వచ్చింది బతుకమ్మ చీరలు బందయ్యాయని చెప్పారు. గత ఏడాది చీరలు ఇస్తున్నామని ఆశ పెట్టి మహిళల ఆశలను ఆవిరి చేశారని అన్నారు. ఈసారైనా ఇస్తారో లేదో అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆడపడుచులకు ఇచ్చే చీరల్లో కూడా ఇంత నిర్లక్ష్యం సరికాదన్నారు. పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ప్రజలందరికీ బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.