పీకల్లోతు కష్టాల్లో ఉన్న నేతన్నకు బ్యాంకులు ఇంకింత గోస పెడుతున్నాయి. నెలనెలా కూడబెట్టుకున్న పొదుపు పథకం పైసలను ఇవ్వకుండా మోకాలు అడ్డుతున్నాయి. లోన్ ఎంఐఎలు కట్టడం లేదని పొదుపు డబ్బులను హోల్డ్‌లో పెట్టాయి. దంతో నేతన్నలు డబ్బుల డ్రా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. అవసరాలకు డబ్బుల కోసం బ్యాంకులను చుట్టూ ప్రదక్షిణలు చేసున్నా తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వస్తున్నది. ఇంకోవైపు చేనేత రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు హామీ అమలు ఊసే లేదు.
– యాదాద్రి భువనగిరి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)
నేతన్నల సామాజిక భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత పొదుపు పథకానికి శ్రీకారం చుట్టారు. నేత కార్మికుల నెలవారీ ఆదాయంలో 8 శాతం ఆర్డీ 1లో జమ చేసిన తర్వాత.. ప్రభుత్వం ఆర్డీ 2లో 15శాతాన్ని నేరుగా జమ చేస్తుంది. ఆ మొత్తం నగదును వడ్డీ సహా మూడేండ్ల తర్వాత కార్మికులను అందుతుంది. అంతకుముందు 2018-2021లో ఒక దఫా ఈ విధంగా లబ్ధిదారులు సాయం పొందారు. 2021-2024 సంవత్సరానికి గానూ ఆగస్టు 31న పథకం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పొదుపు పథకం డబ్బులు విడుదల చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేనేత రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. ఇటీవల ఫోర్త్ సిటీలో ఐఐహెచ్‌టీ తరగతుల ప్రారంభోతవ్సం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం రుణమాఫీ చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. రైతుల మాదిరి తమకు కూడా సర్కారు మాఫీ చేస్తుందని నేతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అనేక మంది కార్మికులు నెలనెలా రుణ వాయిదాలు చెల్లించలేక పోతున్నారు. సర్కారు మాఫీ చేస్తుందని కొందరు.. డబ్బులు వెసులుబాటు కాక మరికొందరు సరిగ్గా చెల్లించడం లేదు.
రుణాలు తీసుకున్న కార్మికుల పరిస్థితి ఇలా ఉంటే.. తీసుకోని వారికి సైతం సక్రమంగా డ్రా అవడం లేదు. ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి చెక్కులను అందించింది. సుమారు రెండు నెలలు దాటినా అందరికీ డబ్బులు అందడం లేదు. బ్యాంకుల్లో చెక్కులు క్లియర్ చేయడం లేదు. తక్కువగా సిబ్బంది ఉన్నారని చెబుతూ జాప్యం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్బీఐలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. సోమవారం ఆలేరు పట్టణంలో చేనేత కార్మికులు ఆందోళన కూడా చేపట్టారు. ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు డబ్బులు ఇప్పించాలని నేతన్నలు కోరుతున్నారు.
జిల్లాలో సుమారు 11వేల మంది చేనేత కార్మికులు ఉన్నారు. వారికి సంబంధించి ఆయా గ్రూపులకు చేనేత, జౌళి శాఖ అధికారులు చెక్కులను అందించారు. కార్మికులు నెలనెలా చెల్లించినా డబ్బులకు తోడు సర్కారు సాయం కలిపి ఒక్కొక్కరికి సుమారు రూ. 2లక్షల వరకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. కానీ జిల్లాలో వందలాది మంది ఖాతాలను బ్యాంకు అధికారులు హోల్డ్‌లో పెట్టారు. ఆయా కార్మికుల డబ్బులు విత్ డ్రా చేసుకోకుండా ఫ్రీజింగ్ చేశారు. ఒక్క పోచంపల్లి పట్టణంలోనే కెనెరా బ్యాంకులో సుమారుగా 100, ఏపీజీబీవీలో 100మందివి నగదును హోల్డ్‌లో పెట్టారు. ఎంత నగదు పెండింగ్ ఉందో అంత హోల్డ్‌లో పెట్టి.. మిగతా డబ్బులు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. కాగా, వారంతా గతంలో నూలు కోసం కోసం ముద్ర తదితర రుణాలు తీసుకున్నారని, నెలనెలా ఈఎంఐలు కట్టడం లేదని, అందుకే హోల్డ్‌లో పెట్టామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దాంతో అనేకమంది చేనేత కార్మికులు నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. పైసలు ఎందుకు రావడం లేదని ఆరా తీస్తూ నిరాశగా వెనుదిరిగి వెళ్తున్నారు. ఇటీవల తమ డబ్బులు ఇప్పించాలని చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్యార్‌కు వినతి పత్రం కూడా అందించారు.