ప్రైవేట్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు మళ్లీ కళాశాలల బంద్‌కు సిద్ధమయ్యాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను కూడా బహిష్కరించనున్నాయి. ఇప్పటికే దసరా సెలవుల తర్వాత అక్టోబర్ 14నుంచి 18వరకు నిరవధిక బంద్ పాటించగా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించక పోవడంతో మళ్లీ పోరాట పట్టాయి.
– రామగిరి, నవంబర్ 19
ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు ప్రభుత్వం అందజేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి అర్హత గల విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నాయి. అందుకు అయ్యే ఖర్చులను ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు భరిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలలకు ప్రభుత్వం రూ.150 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాల్సి ఉంది. గత మూడేండ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోయినా కళాశాలలను నెట్టుకుంటూ వచ్చాయి. అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, కరెంట్ బిల్లులు, యూ నివర్సిటీ రుసుములు, బిల్డింగ్ ట్యాక్స్ చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నాయి. అప్పు చేసి చెల్లించాల్సి వస్తున్నదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి రాగానే ప్రైవేట్ కళాశాలలకు పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా చెల్లిస్తామని, ప్రతి సంవత్సరం బకాయి లేకుండా ఇస్తామని హామీ ఇచ్చిందని.. కానీ అవన్నీ వట్టి మాటలే అని తేలిపోయిందని మండిపడుతున్నాయి.
ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో నిరుద్యోగులమై తాము పేద, నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలనే సంకల్పంతో మాతోపాటు మరో కొంతమంది నిరుద్యోగులైన అధ్యాపకులకు ఆసరా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినవే ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు. మూడేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో అధ్యాపకుల జీతాలు, బిల్డింగ్ అద్దెలు తదితర వాటిని అప్పులు చేసి చెల్లిస్తున్నాం. దీంతో కళాశాలల యాజమాన్యాల పరిస్థితి దయనీయంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకూ నిరవధిక బంద్ కొనసాగిస్తాం. సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తాం. తిరిగి కళాశాలలు తెరవగానే విద్యార్థులకు నష్టం జరుగకుండా అదనపు తరగతులు నిర్వహించి తగు చర్యలు తీసుకుంటాం.
-మారం నాగేందర్‌రెడ్డి, టీపీడీపీఎంఏ ఎంజీయూ చాప్టర్ అధ్యక్షుడు, నల్లగొండ
గత నెలలో కళాశాలల నిరవధిక బంద్ పాటించిన సమయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వారంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో మళ్లీ కళాశాలలను యాథావిధిగా కొనసాగించాం. హామీ ఇచ్చి నెల రోజులు గడిచినప్పటికీ వాటిని చెల్లించకపోవడంతోనే మళ్లీ ఆందోళనకు సిద్ధమయ్యాం. వెంటనే బకాయిలు చెల్లించాలి అందుకోవాలి.
– డి.ప్రవీణ్, కోశాధికారి, టీపీడీపీఎంఏ ఎంజీయూ చాప్టర్, యాదాద్రి భువనగిరి
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయాలి. అప్పులు చేసి అద్దెలు, జీతాలు చెల్లించే పరిస్థితి యాజమాన్యాలకు ఇక లేదు. అనివార్య పరిస్థితుల్లోకి ప్రభుత్వమే యాజమాన్యాలను నెట్టివేసింది. పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించి కళాశాల అభివృద్ధికి సహకరించాలి.
– ఎం. సైదారావు, ప్రధాన కార్యదర్శి, టీపీడీపీఎంఏ ఎంజీయూ చాప్టర్, సూర్యాపేట
దీర్ఘకాలంగా పెండింగ్‌లోఉన్న ఫీజు రీయింబర్మెంట్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ అప్లియేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్(టీపీడీపీఎంఏ) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణాధికారి జి.ఉపేందర్‌రెడ్డికి వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే చెల్లించాలని, అంతవరకు కళాశాలలను నిరవధికంగా ఈ నెల 20 నుంచి బంద్ పెడుతున్నామని తెలిపారు. ఈ నెల 21 నుంచి జరిగే విద్యార్థుల సెమిస్టర్ పరీక్షలు నిర్వహించబోమని చెప్పారు.
ఈ సందర్భంగా వర్సిటీ ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేశారు. అంతకు ముందు వీసీకి వినతి పత్రం వచ్చే క్రమంలో కళాశాలల యాజమాన్యాలు, వీసీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంత అలజడి జరిగింది. తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని యాజమాన్యాలు కోరడంతో వీసీ శాంతించారు. కార్యక్రమంలో టీఎడీపీసీఎంఏ ఎంజీయూ అధ్యక్షుడు మారం నాగేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.సైదారావు, కోశాధికారి డి.ప్రవీణ్‌కుమార్, ఆ సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు, రాష్ట్ర సభ్యులు టి.శ్రీనివాస్‌రెడ్డి, కె.రాంమోహన్, గుండబోయిన జానయ్య, భాస్కర్‌రావు, యాదగిరి, శంకరయ్య, సత్యం, వెంకట్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, హనుమంతు పాల్గొన్నారు.