దామరచర్ల, జూలై 17: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంటులో ఎలాంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా యాజమాన్యం నిషేధాజ్ఞలు విధించింది. పవర్‌ప్లాంటులోని స్టేజీ-1, స్టేజీ-2లో గల యాష్, కోల్ప్లాంట్లను ప్రైవేటీకరణ చేస్తూ టెండర్లు వేశారు. ఈ టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్లాంటులో గత నెల రోజులుగా భోజన విరామ సమయంలో నల్లబాడ్జీలు ధరించి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వీరికి మద్దతుగా భూపాలపల్లి, రామగుండంతో పాటు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్ సౌద, జెన్కో, ట్రాన్స్‌కో తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాష్, కోల్ ప్లాంట్ల టెండర్లను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసి గడువు పొడిగించారు. తొలుత జూన్ 29, తరువాత జూలై 14 వరకు గడువును విధించారు. తిరిగి ఈనెల 24 వరకు గడువు పొడిగించారు.
ఈ క్రమంలో ఆరు నెలల పాటు ఎలాంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేయకుండా ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగ జేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన వైటీపీఎస్‌లో నాలుగు యూనిట్ల ద్వారా 3,200 మెగావాట్ల విద్యుత్ రాష్ర్టానికి అందిస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ చేయడంపై తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా నిరుద్యోగులూ అయోమయంలో ఉన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా ఉద్యోగులను నిరోధించడం వారి హక్కును కాలరాయడమేనని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. అంచెలంచెలుగా విద్యుత్ ప్లాంట్లను ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, టెండర్ల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరుతున్నారు.