నాంపల్లి, జనవరి 31 : నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో శనివారం దారుణ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ప్రియుడి బాబు (6 నెలలు) సైతం మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కేతేపల్లి గ్రామానికి చెందిన నగేశ్ యాదవ్, మమత(25) ఇరువురు దంపతులు. వీరికి ఆరు నెలల వయస్సు ఉన్న బాబు ఉన్నాడు. అయితే నగేశ్ యాదవ్‌కు, అదే గ్రామానికి చెందిన సుజాతకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. సుజాతకు పెండ్లి అయి భర్త గతంలోనే చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో తన ఇద్దరు కూతుర్లలో ఒకరిని పెండ్లి చేసుకోవాల్సిందిగా నగేశ్‌పై ఒత్తిడి చేస్తూ వస్తున్నట్లుగా సమాచారం. సుజాత ప్రతిపాదనను నగేష్ తిరస్కరించడంతో పగ పెంచుకుంది.
భార్యాబిడ్డా ఉండడంతోనే అతడు తిరస్కరిస్తున్నట్లుగా భావించిన సుజాత వారి అడ్డు తొలగించాలనే ఉద్దేశ్యంతో శనివారం నగేశ్ ఇంటికి వెళ్లి మరీ ఈ దారుణానికి పాల్పడింది. తన చిన్నారి బాబుకు పాలు ఇస్తున్న మమతపై సుజాత తన వెంట సంచిలో తెచ్చుకున్న పెట్రోల్, కారం, కత్తిలో పెట్రోల్‌ను తీసి ఒక్కసారిగా వారిమీద పోసి నిప్పంటించింది. దీంతో మంటలకు తాళలేక మమత తన ఒడిలోని చండిబిడ్డను రక్షించుకునేందుకు ఒక్కసారిగా కిందకు విసిరేసి మంటల్లో సజీవ దహనమైంది. తీవ్ర గాయాలైన బాబును చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్ నిలోఫర్‌కు తరలించగా పరిస్థితి విషమించడంతో బాబు సైతం మృతిచెందాడు. ఈ హృదయ విదారక ఘటనతో ఊరిలో అంతటా విచారం నెలకొంది. నిందితురాలు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.