కట్టంగూర్, జనవరి 03 : యూరియా బుకింగ్ యాప్‌పై రైతులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గిరి ప్రసాద్ అన్నారు. శనివారం కట్టంగూర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా సరఫరాలో పారదర్శకత, సౌలభ్యం కోసం యాప్ ఉపయోగ పడుతుందన్నారు. రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ లేదా ఆధార్ నంబర్ ఉపయోగించి యూరియాను బుక్ చేసుకోవడంతో పాటు స్టాక్ వివరాలను తెలుసుకోవచ్చన్నారు. యూరియా బుక్ చేసిన తర్వాత 24 గంటల్లోపు తీసుకోవాలని లేదంటే మళ్లీ 15 రోజుల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉండదన్నారు.
స్మార్ట్‌ఫోన్ లేని వారు ఫెర్టిలైజర్ షాపులలో ఉన్న వాలంటీర్లు, వ్యవసాయాధికారుల సహాయంతో బుక్ చేసుకోవచ్చని, కౌలు రైతులు కూడా ఆధార్, పాస్‌బుక్ వివరాలతో బుక్ చేసుకుంటే భూ యజమానులకు ఓటీపీ వస్తుందని తెలిపారు. పట్టాదారు పాస్‌బుక్ నంబర్ లేదా ఆధార్ నంబర్ తోపాటు పంట వివరాలు, భూమి విస్తీర్ణం యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, సిబ్బంది చెరుకు చంద్రయ్య, సైదులు, ప్రసాద్, రాంబాబు, యాదగిరి, రైతులు పాల్గొన్నారు.