పెన్‌పహాడ్, మే 29 : ప్రజలను చైతన్యం చేయడమే పోలీస్ ప్రజా భరోసా లక్ష్యమని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సామాజిక అంశాలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజల సహకారం లేకుండా పోలీస్, న్యాయ వ్యవస్థ పటిష్టంగా పని చేయడం సాధ్యపడదన్నారు. ప్రజలంతా చట్టాన్ని గౌరవిస్తూ, అన్యాయాన్ని సహించకుండా ముందుకు వస్తే పోలీస్ శాఖ మేమున్నామంటూ భరోసా ఇస్తుందన్నారు.
సమాజంలో యువత మాదక ద్రవ్యాలకు, ఆన్లైన్ బెట్టింగులకు బానిసలు కాకుండా, చదువు, ఉద్యోగాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ప్రధానమన్నారు. కాగా పలు చట్టాలపై పోలీస్ కళాకారులు ”ఆట -పాట” ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెన్‌పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ, పోలీస్ సిబ్బంది మురళీధర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, ప్రవీణ్, బాలకృష్ణ, నరేశ్‌రెడ్డి పాల్గొన్నారు.