రామగిరి, జూన్ 15 : నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఆవంచ సీతారామారావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవన్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో నల్లగొండకు చెందిన సీనియర్ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డికి ప్రదానం చేశారు. యాదగిరి రెడ్డి ఆరు దశాబ్దాల సాహిత్య కృషికి గుర్తింపుగా ప్రముఖ సాహితీవేత్త, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మోత్కూరు నరహరి తదితరుల చేతుల మీదుగా అందజేశారు. పురస్కారాన్ని పొందిన యాదగిరి రెడ్డిని నల్లగొండకు చెందిన సాహితీవేత్తలు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, పెరుమాళ్ల ఆనంద్, డా. సాగర్ల సత్తయ్య, అలుగుబెల్లి రామచంద్రారెడ్డి, ఓరుగంటి పురుషోత్తం, పున్న అంజయ్య, వల్లాల అచ్చయ్య పరందాం, శీలం భద్రయ్య అభినందించారు.