నీలగిరి, మార్చి 26 : సమాచారం అందిన వెంటనే స్పందించి వేగంగా విచారణ చేసి తమ నిబద్ధతను చాటిచెప్పి ప్రశంసలందుకున్నారు నల్లగొండ టూటౌన్ పోలీసులు. గురువారం ఉదయం నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ షకీనా అనే మహిళ ర్యాపీడ్ ద్వారా ఆటోను బుక్ చేసుకుంది. తన ప్రాంతానికి వెళ్లిన తర్వాత ఆటోలో ఆమె తన మొబైల్ మర్చిపోయింది. అక్కడి నుండి వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ తర్వాత సెల్ఫోన్ గుర్తించాడు. వెంటనే డయల్ 100కు సమాచారం అందించాడు. నల్లగొండ టూటౌన్ ఎస్ఐకి సమాచారం రావడంతో తన సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేశారు. బాధితురాలి వివరాలను గుర్తించి సెల్ఫోన్ అందజేశారు. ఎండీ షకీనా, కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సైదులు మాట్లాడుతూ.. వంశీకృష్ణ వంటి నిజాయితీ గల ఆటో డ్రైవర్లు సమాజానికి ఆదర్శం అని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.