యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : భువనగిరి జిల్లా కోర్టులకు అధునాతన కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి. కోర్టుల్లో అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ మేరకు భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు. శనివారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. బీఆర్ఎస్ హయాంలోనే భవనాలు మంజూరు అయ్యాయి.
తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా ఆవిర్భవించింది. దీంతో ప్రత్యేకంగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. జిల్లాలో కోర్టుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం కోర్టు నిర్వహిస్తున్న అద్దె భవనాలు సౌకర్యవంతంగా లేవు. కక్షిదారులకు సేవలందించడం, న్యాయమూర్తులు, అడ్వకేట్ల కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఇందులో భువనగిరి కోర్టు కూడా ఉన్నది. నూతన భవనాన్ని భువనగిరి సమీపంలోని మాస్కుంట గుట్టపై నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం గుట్టపై సర్వేనంబర్ 742లో ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించింది. భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.81 కోట్లు విడుదల చేస్తూ పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఈ స్థలంలో నాలుగు అంతస్తుల్లో 12 భవనాలు నిర్మించనున్నారు. జిల్లా కోర్టులు, న్యాయమూర్తుల క్వార్టర్స్, పరిపాలన భవనాలు, బార్ అసోసియేషన్ భవనం, పార్కు, పారింగ్ ఏరియా, లాన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇందుకుగాను టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. గుట్ట చదును పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తర దిశలో భవనాలను నిర్మించనునారు. మొదట కోర్టు భవనాలు, చుట్టూ ప్రహరీ, అంతర్గత రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. వచ్చే ఏడాది మార్చి లోగా పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం భువనగిరి పట్టణ నడిబొడ్డులో సుమారు 2 ఎకరాల ప్రాంగణంలో కొనసాగుతున్న స్థానిక, కోర్టులన్నీ నూతన భవనంలోకి మారనున్నాయి.
జిల్లా కోర్టులకు కొత్త భవన నిర్మాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే శ్రీకారం చుట్టారు. అప్పుడే భవన నిర్మాణాలు మంజూరయ్యాయి. భవనాల కోసం స్థలాన్ని సైతం అప్పుడే కేటాయించారు. 2022 మే 29న స్థల పత్రాలను అప్పటి రెవెన్యూ అధికారులు న్యాయ శాఖ అధికారులకు అప్పగించారు. శంకుస్థాపన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్కుంటలోని గుట్టపై 500 మంది కూర్చునేలా ఆర్అండ్బీ, న్యాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా ప్రధాన జడ్జి జయరాజ్ ఆధ్వర్యంలో ఇతర న్యాయమూర్తులు, కలెక్టర్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్అండ్బీ అధికారులు తదితరులలు శంకుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
భువనగిరి అర్బన్, అక్టోబర్ 10 : భువనగిరి పట్టణలో నూతన జిల్లా కోర్టు భవనాలను నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జిల్లా నూతన కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా శుక్రవారం కలెక్టర్ హనుమంతరావు శంకుస్థాపన పనులు, స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. శంకుస్థాపనకు హైకోర్టు చీఫ్ జస్టిస్, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు హాజరుకానున్నారు.