యాదాద్రి భువనగిరి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ సాలర్షిప్ను అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల ఎన్రోల్మెంట్లో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఇంకా పాఠశాలల రిజిస్ట్రేషన్ కూడా పూర్తికాలేదు. ఫలితంగా ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది. దీంతో ఏటా వేల కోట్ల రూపాయల సాయం కోల్పోయే అవకాశం లేకపోలేదు.
డే సాలర్లకు 3500.. హాస్టల్స్ విద్యార్థులకు 7వేలు..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందుతుంది. డే సాలర్లకు ఏడాదికి రూ.3500 చొప్పున, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఏడాదికి రూ.7 వేలు చెల్లించనున్నారు. దివ్యాంగులు అయితే మరో 10 శాతం అదనంగా ఇవ్వనున్నారు. సాలర్ షిప్ లో కేంద్రం 60 శాతం , రాష్ట్రం 40 శాతం వాటా చెల్లిస్తున్నా యి. ఎస్సీ విద్యార్థుల తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం 2.50 లక్షలు దాటకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతా, తల్లదండ్రుల వివరాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ నంబర్, ఫొటోతో epass.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లి ప్రీ మెట్రిక్ సాలర్ షిప్ ఆప్షన్ క్లిక్ చేసి అపె్లై చేసుకోవాలి. ఈ సాలర్ షిప్ కు సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి నగదు బదిలీ చేస్తామని అధికారులు తెలిపారు.
విద్యార్థుల రిజిస్ట్రేషన్ 1.55 శాతమే..
ఈ-పాస్ లో పాఠశాలల రిజిస్ట్రేషన్ ఎకడ వేసిన గొంగళి అకడే అన్న చందంగా ఉండటంతో విద్యార్థుల నమోదు కూడా ముందుకు సాగడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2835 పిల్లలు రిజిస్ట్రేషన్‌కు అర్హులు కాగా కేవలం 44 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేశారు. అంటే కేవలం 1.55 శాతం మాత్రమే పూర్తయింది. నవంబర్ 13వ తేదీ వరకు అందిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 2797 మందికి కేవలం 0.82 శాతంతో 23 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో 3080 మంది విద్యార్థులు లక్ష్యం కాగా.. 91 మంది ఈ -పాస్ లో దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంతో ఎస్సీ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది.
879 సూళ్లకు 228 మాత్రమే రిజిస్ట్రేషన్..
ప్రస్తుత అకడమిక్ సంవత్సరం ప్రారంభంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొదటగా పాఠశాలలు ఈ పాస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 879 పాఠశాలలు ఉండగా.. ఇప్పటి వరకు 228 పాఠశాలలు ఈ పాస్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేశాయి. మిగతా పాఠశాలల్లో మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో అటు ఎస్సీ సంక్షేమ శాఖ, ఇటు జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.