నల్లగొండ, మార్చి 12 : పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ సర్పంచులు బుధవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దాంతో వారిని ఉదయం నుంచే ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించి అరెస్ట్ చేశారు. పోలీస్స్టేషన్లకు తీసుకెళ్లారు. దాంతో మాజీ సర్పంచులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బిల్లులు విడుదల చేయకుండా, నిరసన తెలుపకుండా అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.
ఆయా గ్రామాల్లో గతంలో మాజీ సర్పంచులు సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీల భవనాలు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.1200కోట్లు ప్రభుత్వం నుంచి వారికి రావాల్సి ఉన్నది. కానీ కాంగ్రెస్ సర్కా రు అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా బిల్లులు విడుదల చేయడం లేదు. ఇప్పటికే పలుమార్లు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టారు. బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించగా పోలీసులు విఫలం చేశారు.