– బరితెగించిన మతోన్మాదిని శిక్షించాలి
– లౌకిక, ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి
– కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున
నల్లగొండ, అక్టోబర్ 07 : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున అన్నారు. బరితెగించిన మతోన్మాది రాకేష్ కిశోర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేసి దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్, ప్రజా సంఘాల అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాలడగు నాగార్జున మాట్లాడుతూ.. సోమవారం ఉదయం కేసు విచారణ సమయంలో డయాస్ వద్దకు వెళ్లిన న్యాయవాది రాకేష్ కిశోర్ ఒక్కసారిగా తన షూ తీసి సిజెఐపైకి విసిరే ప్రయత్నం చేయడం రాజ్యాంగ వ్యవస్థకు అవమానకరమన్నారు. భారత చరిత్రలో ఇది చీకటి రోజు అన్నారు. సనాతనం పేరుతో జరిగే దాడులను భారత సమాజం సహించదన్నారు.
ప్రముఖ అడ్వకేట్ దర్శనం నరసింహ మాట్లాడుతూ.. ప్రధాన న్యాయమూర్తి పైన దాడి మాత్రమే కాదు, రాజ్యాంగంపై జరిగిన దాడి అన్నారు. సమిష్టిగా భారత సమాజం గవాయ్ కు సంఘీభావంగా, అండగా నిలవాలని కోరారు. ఈ బుద్ధిహీనమైన చర్య ఈ సమాజాన్ని ద్వేషం, మతోన్మాదం ఎలా ముంచెత్తాయో చూపిస్తుందని విమర్శించారు. ఈ చర్య దురదృష్టకరమని, ఖండించదగినదని, ఈ ఘటనను న్యాయవ్యవస్థపై దాడిగా పేర్కొన్నారు. ఈ ఘటన సాధారణంగా జరిగింది కాదని, స్వతంత్ర న్యాయవ్యవస్థపై జరిగిన బహిరంగ దాడిగానే పేర్కొన్నారు. దీనిని వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తి చేసిన చర్యగా పరిగణించలేమని, సంఘ్ పరివార్ శక్తులు దేశంలో న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రతపై, న్యాయ సమీక్ష శక్తిపై, లౌకికవాద భావనపై, దుర్మార్గపు దుర్భాషల ప్రచారంలో భాగంగా దీనిని చూడాలన్నారు. ఈ ఘటనను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, నిందితుడి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరి సాగర్ మాట్లాడుతూ.. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి నోరు మెదపక పోవడం రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల వారికి ఏపాటి గౌరవం ఉందో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. సనాతన ధర్మం అంటే దాడులు చేయడమా అని ప్రశ్నించారు. వందేండ్ల ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులు నేర్పుతున్నది ఇదేనా అన్నారు. వందేళ్ల ఆర్ఎస్ఎస్ కార్యచరణ న్యాయ వ్యవస్థపై దాడి చేయడానికి సిద్ధమయిందా అన్నారు. ధర్మ పీఠంపై దురాక్రమణ దాడి జాతి విచ్చిన్నానికి నిదర్శనం అన్నారు. సనాతన ధర్మం పేరుతో మను ధర్మాన్ని ప్రతిష్ఠంచదలుచుకుని ఈ దాడులకు తెగబడుతున్నారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ధర్మం కంటే ఈ భారతదేశంలో మరే ధర్మం గొప్పది కాదన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన మేధావి ఆ వ్యవస్థ మీద కూర్చోవడం బిజెపి జీర్ణీంచుకోలేకపోతుందన్నారు. భారతదేశాన్ని ఆదునికరించింది రాజ్యాంగ ధర్మం అన్నసంగతి యాది మరువొద్దు అన్నారు. లౌకిక, ప్రజాస్వామిక, రాజ్యాంగ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గోలి సైదులు, ఐద్వా మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ, బొల్లు రవీందర్ కుమార్, మాల మహానాడు జాతీయ నాయకుడు రేఖల సైదులు పాల్గొన్నారు.