ఆత్మకూర్.ఎస్, ఫిబ్రవరి 24 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలకు రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. అంతేకాకుడా ఆసుపత్రుల్లో అందిస్తున్న వసతులు, వైద్య సేవలపై అవార్డులూ లభిస్తున్నాయి. ఆత్మకూరు.ఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్యూఏఎస్) కింద 92.2 శాతం స్కోర్ పొంది ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఒకప్పుడు పెద్దగా తెలియని మండల కేందంలో పీహెచ్సీ ఇప్పుడు అనేకమంది రోగులు వచ్చిపోతుండటం విశేషం. ప్రసవాల కోసం వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా దవాఖానలో పచ్చని చెట్లతోపాటు పూలు, ఔషధ మొక్కలు, రోగులతో పాటు వచ్చేవారికి కూర్చోవడానికి సిమెంట్ కుర్చీలు, వాహనాల పార్కింగ్తో ప్రశాంతమైన వాతవరణం కనిపిస్తున్నది.
నాడు కాయకల్ప అవార్డు
ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డులు ఉమ్మడి జిల్లాలో తొమ్మిది పీహెచ్‌సీలకు దక్కడం విశేషం. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వైద్య సేవల అందించడంలో ఆరు ఆంశాల ఆధారంగా 70శాతం పాయింట్లు పొంది ఆత్మకూర్(ఎస్) పీహెచ్సీ ప్రథమస్ధానంలో నిలిచి కాయకల్ప అవార్డు సాధించింది.
నేడు నాణ్యతా ప్రమాణాల్లో అవార్డు
ఇప్పుడు ఆత్మకూర్(ఎస్) పీహెచ్సీ నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్ క్యూఏఎస్) కింద 92.2 శాతం స్కోర్ పొంది ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఎంపికైంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ స్టాండర్డ్స్ ఆరు ప్రజారోగ్య సౌకార్యలను పరిశీలించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం విశేషం.
మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నా ము. దవాఖానలో రోజురోజుకి ఓపీ పెరుగుతున్నది. గతంలో డెలివరీలు సూర్యాపేటలో చేసేవారు. ఇపుడు ఇక్కడే చేస్తున్నా ము. పీహెచ్సీ కేంద్రాల్లో వైద్యసేవలు మెరుగుపరిచేందుకు ఇటువంటి అవార్డులు దోహదపడుతాయి.
– డాక్టర్ రాజ్‌కుమార్, మండల వైద్యాధికారి
ఆసుపత్రిలో పచ్చదనం పెంచాం
ఆరోగ్య కేంద్రంలో హరితహారం కార్యక్ర మం ఉద్యమంలా చేప ట్టాం. పీహెచ్సీలో నీడనిచ్చే మొక్కలతోపాటు పూలు, ఔషధ మొక్క లూ భారీగా పెంచుతున్నాం. దాంతో పీహెచ్సీ ఆవరణం పచ్చదనంతో పరుచుకొని పరిశ్రుభంగా ఉన్నది. నాణ్యతా పర మైన అవార్డు లభించడం సంతోషంగా ఉన్నది.
– వెంకటేశ్వర్లు, సీహెచ్ఓ