అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది. కానీ పోలింగ్
ప్రక్రియ కొనసాగుతుండగానే గెలుపోటములపై అంచనాల లెక్కలు మొదలయ్యాయి. ఉమ్మడి
జిల్లా వ్యాప్తంగా పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమది గెలుపంటే తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఎక్కడక్కడ తమకు ఎన్ని ఓట్లు లభించాయో విశ్లేషిస్తున్నారు. అభ్యర్థులు, వారి విజయం కోసం కృషి చేసిన అనుచరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఇవే లెక్కల్లో మునిగి తేలుతున్నారు.
పెరిగిన పోలింగ్ శాతం, ఆయా గ్రామాలు, పట్టణాల్లో జనం నాడిని విశ్లేషిస్తూ జిల్లా జనం సైతం ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నెల 3న నల్లగొండలో 6, సూర్యాపేటలో 4, భువనగిరిలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈవీఎంలను ఆయా జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరిచారు. ఈవీఎంలు అయినందున మధ్యాహ్నం ఒంటి గంట వరకే పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత ఎన్నికలతో పోలింగ్ శాతాన్ని పోల్చుతూ అందరూ అభ్యర్థులు, జిల్లా జనాలు సైతం ఫలితాలపై అంచనాల్లో మునిగిపోయారు. గత ఎన్నికల్లో మండలాలు, పోలింగ్ బూత్‌ల వారీగా ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది? ప్రస్తుతం ఆయా బూత్‌ల పరిధిలో ప్రభావం చూపగల నాయకులు ఏయే పార్టీల వైపు ఉన్నారు? జనంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎంత సానుకూలత ఉంది.
ఎంత మంది ప్రజా కూటమి వైపు అనుకూలంగా ఓటేశారు? అనే అంచనాలతో లోతైన విశ్లేషణలు పలువురు చేపడుతున్నారు. ఆది నుంచీ బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు జై కొడుతున్న జిల్లా జనం.. అందుకు తగ్గట్టుగానే అనుకూలంగా ఓట్లు వేసినట్లు ఆ పార్టీ నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. ఇక పోల్ మేనేజ్మెంట్లో ఎవ్వరూ సక్సెస్ అయ్యారనేది కూడా ఈ సారి కీలకంగా మారింది. నాన్ లోకల్ ఓటర్లు ఎటు మొగ్గు చూపారూ? స్థానిక ఓటర్ల పరిస్థితి ఏంటన్న కోణంలోనూ విశ్లేషణలు మొదలుపెట్టారు. ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమదే విజయం అంటూ దగ్గరి వాళ్లతో లెక్కలు సైతం వెల్లడిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుపొందింది. తరవాత హుజూర్నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్లో చేరడంతో ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చి చేరాయి. కాగా 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆరు స్థానాలు, కాంగ్రెస్ ఐదు, ఆ పార్టీ పొత్తులో సీపీఐ ఒక స్థానం గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మెజార్టీ స్థానాల్లో హోరాహోరీ పోరు కనిపించింది.
దీంతో ఆయా పార్టీల నేతలు ఎవ్వరికీ వారే తమకు అనుకూలంగా లెక్కలు వేసుకుంటున్నారు. తమ తమ స్థానాల్లో తమదే విజయమంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే లు.. తామే గెలుస్తున్నామంటూ వాళ్ల ప్రత్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్‌కు ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉన్నందున… ఇంకా పలు విశ్లేషణలకు, బెట్టింగులకు సైతం అవకాశముంది.