నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది నేరాలు పెరిగాయి. వాటిల్లో తీవ్ర నేరాలైన హత్యలు, దోపిడీలు పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. హత్యల్లోనూ కేవలం కుటుంబ తగాదాలతో చోటుచేసుకున్నవే 33 శాతం ఉన్నాయి. సోషల్ మీడియాను వాడుకుని సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. దొంగతనాలు పెరిగాయి. చోరీ అయిన సొత్తు భారీగా ఉంది. రోడ్డు ప్రమాదాల తీవ్రత అలాగే కొనసాగుతుండగా ఈ ఏడాది 373 మంది మృత్యువాత పడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 9,840 నమోదయ్యాయి. మోటారు వాహనాల కేసుల్లో మొత్తం రూ.4.87కోట్ల రూపాయల జరిమానలు విధించారు. డయల్ 100కు 51,650 కాల్స్ వచ్చినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ శనివారం విడుదల చేసిన వార్షిక నేర నివేదిక స్పష్టం చేసింది.
2024 సంవత్సరంలో నల్లగొండ జిల్లాలో ఎఫ్ఐఆర్ల నమోదు భారీగా పెరిగింది. 2023లో తీవ్ర నేరాలకు సంబంధించి 185 ఎఫ్ఐఆర్లు కాగా, ఈ ఏడాది 211కి పెరిగింది. సాధారణ నేరాలు గతేడాదిలో 7,716 కాగా, ప్రస్తుత ఏడాదిలో 8,484 నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే 2023లో రిజిస్ట్రర్డ్ కేసుల సంఖ్య 7,901 ఉండగా, ఈ సంవత్సరం 8,695కు చేరాయి. మేజర్ క్రైమ్స్‌ను పరిశీలిస్తే హత్యలు, మోసాలు, చోరీల సంఖ్య పెరిగింది. ఆస్తి కోసం హత్యలు 2023లో జీరో కాగా, 2024లో 5, బందిపోటు దొంగతనాలు గతేడాది ఒక్కటి జరుగ్గా ఈ ఏడాది రెండు చోటుచేసుకున్నాయి. దోపీడీలు 2 నుంచి 10కి పెరిగాయి. హత్యలు గతంలో 32 ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 33 హత్యలు జరిగాయి. మూఢనమ్మకాలతో జరిగిన హత్యలు 9 నుంచి 5కి తగ్గాయి. హత్య కేసుల కారణాలను పరిశీలిస్తే కుటుంబ తగదాల కారణంగా జరిగినవి 33 శాతం ఉండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. మొత్తం 33 కేసులు నమోదైతే అందులో 11 హత్యలు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలతో జరిగినవే ఉన్నాయి. ఆర్ధ్దికపరమైనవి 4, వివాహేతర సంబంధాల నేపథ్యంలో 6, భూతగాదాలతో 4 హత్యలు జరిగాయి.
భారీగా పెరిగిన మోసాలు..
ఈ ఏడాది చీటింగ్ కేసులు భారీగా పెరిగాయి. 2023లో 362 చీటింగ్ కేసులు నమోదైతే ఈ ఏడాది ఇప్పటివరకు 657 కేసులు నమోదయ్యాయి. ఆర్ధిక పరమైన మోసాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఇక లైంగికదాడుల కేసులు 98 నుంచి 100కి పెరిగాయి. హత్యాయత్నం కేసులు 56 నమోదయ్యాయి. మిస్సింగ్ కేసులు తగ్గడం ఊరటనిచ్చే అంశం. గతంలో 522 మిస్సింగ్ కేసులు ఉండగా, ప్రస్తుతం 476 నమోదయ్యాయి.
పెరిగిన చోరీలు, సొత్తు విలువ
ఈ ఏడాదిలో దొంగతనాలు కూడా భారీగానే జరిగినట్లు పోలీస్ నివేదిక స్పష్టం చేస్తున్నది. 2023లో మొత్తం 523 చోరీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 550 కేసులు అయ్యాయి. 2023లో మొత్తం రూ.4.83కోట్ల సొత్తు చోరీకి గురికాగా, ఈ ఏడాది రూ.14.13కోట్ల సొత్తు పోయింది. అందులో రూ.5.06కోట్లను పోలీసులు రికవరీ చేయగలిగారు. గతంతో పోలీస్తే రికవరీ శాతం 28 నుంచి 36శాతానికి పెరిగింది. కేసుల ఛేదన కూడా 41 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. ఈ ఏడాది పోలీసులు తీవ్ర నేరాలు, దోపిడీలకు పాల్పడే పార్థీ గ్యాంగ్ ఆట కట్టించగలిగారు. అంతర్రాష్ట్ర బైక్ దొపిడీ ముఠాను పట్టుకోగలిగారు.
మహిళల కేసుల్లో మెరుగుదల
మహిళలకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది మొత్తం 655 కేసులు నమోదు కాగా.. ఇందులో లైంగిక దాడులు 97, కిడ్నాప్‌లు 46, మర్డర్లు 8, వేధింపులు 292, వరకట్న వేధింపుల మరణాలు ఒకటి నమోదయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈసారి అసాంఘిక కార్యకలాపాల నివారణకు గట్టి ప్రయత్నం చేసింది. ఇందులో పీడీఎస్ అక్రమ రవాణా కేసులు 217, ఇసుక అక్రమ రవాణా 482, గుట్కా విక్రయాలు 8, గోవుల అక్రమ రవాణా 28, నకిలీ విత్తనాల విక్రయం 2, ఎక్సైజ్ కేసులు 613 కేసులు నమోదయ్యాయి.
ఆందోళనకరంగా రోడ్డు ప్రమాదాలు
2023లో రోడ్డు ప్రమాదాలు 813 జరగ్గా 399 మంది మృతిచెందారు. 829 మంది గాయపడ్డారు. ప్రస్తుత ఏడాదిలో ప్రమాదాల సంఖ్య 863కు పెరిగింది. మృతుల సంఖ్య 373, క్షతగాత్రుల సంఖ్య 756గా నమోదైంది. మోటార్ వాహనాలకు సంబంధించి పోలీసులు ఈ ఏడాదిలో 1,54,934 కేసులు నమోదు చేసి, రూ.4.87కోట్ల ఫెనాల్టీని విధించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య 9,840కి చేరింది. 65 కేసుల్లో జైలు శిక్ష పడగా, అందులో 11 జీవిత ఖైదీ శిక్షలు ఉన్నాయి. లోక్‌అదాలత్‌లో 23,204 కేసుల్లో పోలీసుల చొరవతో రాజీ జరిగింది.
సవాల్‌గా సైబర్ నేరాలు
What Is Cyber Crime
ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితం ఉండడం లేదు. గతేడాదితో పోలిస్తే సైబర్ నేరాల సంఖ్య తగ్గినట్టే కనిపిస్తున్నా కోల్పోయిన సొమ్ము మాత్రం భారీగా పెరిగింది. 2023లో 276 సైబర్ నేరాలు రిజిస్ట్రర్ అయ్యాయి. వాటిల్లో రూ.81లక్షల నగదు పోగా రూ.9.63లక్షలు రికవరీ అయ్యింది. ఈ ఏడాదికి వచ్చే సరికి 135 కేసులే నమోదైనా పోయిన నగదు విలువ రూ.4.99 కోట్లు ఉండడం గమనార్హం. రికవరీ రూ.85లక్షలుగా ఉంది.
ప్రధాన కేసులు…
నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
నీలగిరి, డిసెంబర్ 28 : నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో నల్లగొండజిల్లాలో నేరాల సం ఖ్య తగ్గిందని, కానీ రెండు ఎన్నికల నిర్వహణ కారణంగా క్రైమ్ రేట్ పెరిగిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నా రు. శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో 2024 వార్షిక నేర నివేదికను విడుదల చేసి మాట్లాడా రు. జిల్లాలో గత సంవత్సరంతో పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కారణంగా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. మహిళలపై నేరాలను తగ్గించామన్నారు. చెడుదారి పడుతున్న యువతను సన్మార్గంలోకి తీసుకువచ్చేందుకు మిషన్ పరివర్తన్ తీసుకొచ్చినట్లు చెప్పారు. గంజాయి నియంత్రణపై దృష్టి సారించామని, దొంతనాల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుని గస్తీ పెంచామని తెలిపారు. అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపినట్లు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా గతేడాదితో పోల్చితే సగానికిపైగా కేసులు తగ్గించగలిగామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తనతోపాటు డీఎస్పీ స్థాయి అధికారులు మండలాలను దత్తత తీసుకుని కృషి చేశామన్నారు. రెండు ఎన్నికల సందర్భంగా 308 కేసుల్లో 5 కోట్ల నగదు పట్టుకున్న ట్లు తెలిపారు. ప్రమాదకరంగా మారిన పార్థీ గ్యాంగ్ ముఠాను జిల్లా పోలీసులు ప్రాణాలకు తెగించి అరెస్టు చేశారని చెప్పారు. జిల్లాలో 3,614 మంది తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకోగా ఇప్పటివరకు 1,473 రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. సమావేశంలో ఏఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు శివరాంరెడ్డి, లక్ష్మీనారాయణ ఉన్నారు.