నల్లగొండ, ఆగస్టు 26 : పాడి సంపదను పెంచేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా చేపడుతున్న ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. మేలు జాతి పశు సంపద లక్ష్యంగా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.40 లక్షల పశువులకు ఉచిత కృత్రిమ గర్భధారణ చేయాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకం ఈ దఫా కూడా డిసెంబర్ చివరి వరకు నిర్వహించనున్నారు. ఇందుకు గాను జిల్లాలో ఉన్నటువంటి 248 గోపా ల మిత్రలు, 74 మంది మైత్రీలు గ్రామ పంచాయతీలో పాటు ఆవాసాలు చుట్టి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది. తొలి ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75 వేలు క్రితం సంవత్సరం 1.79 లక్షలు ఉండగా ఈ ఏడాది 2.40 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ (ఏఐ) చేయాలని సర్కార్ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ కృత్రిమ గర్భధారణ వల్ల జిల్లాలో సంకర జాతి పశువుల సంఖ్యతో పాటు పాలిచ్చే పశువుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో 14 లక్షల పశువులు ఉండగా అందులో 5.58 లక్షల పశువులు పాలిస్తున్నట్లు ఆ శాఖ రికార్డులు చెబుతున్నాయి.
నేటి నుంచి డిసెంబర్ చివరి వరకు..
జిల్లా వ్యాప్తంగా వినియోగానికి అనుగుణంగా పాల ఉత్పత్తి లేకపోవడంతో పాల ప్యాకెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో పాడి రంగానికి చేయూతనిచ్చేందుకు మేలు జాతి పశువుల ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జాతీయ కృత్రిమ గర్భధారణ పథకాన్ని ప్రభుత్వం ఉచితంగా అమలు చేస్తున్నది. పశువులు అధికంగా ఎదకు వచ్చేది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మాత్రమే కావడంతో ఈ నాలుగు నెలలు కృత్రిమ గర్భధారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పశుగణాభివృద్ధి సంస్థ ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శనివారం నుంచి ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు నాలుగు నెలల పాటు నిర్విరామంగా ఉచిత కృత్రిమ గర్భధారణ చేయనున్నారు. సాధారణ సమయంలోనూ ఈ కృత్రిమ గర్భధారణ జరుగుతున్నప్పటికీ గోపాల మిత్రలు నామినల్‌గా ప్రతి పాడి రైతు నుంచి రూ.130 వసూలు చేస్తారు. మేలు జాతి పశువుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేస్తే మేలు జాతి దూడల ఉత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుందనే ఉద్దేశంతో సర్కార్ ఈ కార్యక్రమం చేపడుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడేండ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించగా తొలిసారి 2019-20లో 75 వేల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా 23 వేల దూడలు పుట్టాయి. 2020-21లో 1.79 లక్షల పశువులకు ఏఐ చేపట్టగా 1.11 లక్షల దూడలు పుట్టాయి. గతేడాది 2.12 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయగా 1.31 లక్షల పశువులకు దూడలు పుట్టాయి.
పాల ఉత్పత్తి పెంపు కోసమే..
ఉమ్మడి జిల్లాలో సుమారు 36 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీటిలో ప్రతీ కుటుంబం రెగ్యులర్‌గా పాలు, టీ, కాఫీ, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇలా ఏదో ఒకటి వినియోగిస్తున్నది. అయితే వినియోగానికి తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో 14,05,588 తెల్ల, నల్ల పశువులు ఉండగా అందులో 5.58 లక్షల పశువులు రెగ్యులర్‌గా సగటున 4 లీటర్ల చొప్పున పాలు ఇస్తుండడంతో సుమారు 22.34 లక్షల లీటర్ల పాల దిగుబడి ఉంటున్నది. ఇందులో ఆయా డెయిరీలకు పోను మన వినియోగానికి 15 లక్షల లీటర్లు ఉంటున్నట్లు పశు సంవర్ధక శాఖ అంచనా. జిల్లాలో సగటున లీటర్ చొప్పున వినియోగం అంచనా వేస్తే 36 లక్షల లీటర్ల పాలు అవసరం. అంటే ఇంకా 20 లక్షల లీటర్ల మేర దిగుమతి చేసుకుని వినియోగించుకుంటున్నాం. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే మేలు రకమైన పశువుల సంఖ్య పెరగడంతో పాటు పాల దిగుబడి పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కృత్రిమ గర్భధారణ ద్వారా సంకరజాతికి చెందిన మేలు రకమైన పశువుల ఉత్పత్తి పెరిగేలా డీఎల్‌డీఏ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రతి ఏటా డీఎల్‌డీఏకు నిధులు కేటాయించి కృత్రిమ గర్భధారణ చేపడుతున్నది.
ఉచిత కృత్రిమ గర్భధారణను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి డిసెంబర్ చివరి వరకు నాలుగు నెలల పాటు జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా ఇన్సెమినేషన్ చేస్తున్నది. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పశువులు ఎదకు రాగానే సమీపంలోని గోపాల మిత్రలు లేదంటే మైత్రీలకు సమాచారం అందించి పశువుకు ఏఐ చేసుకోవాలి. ఈ నాలుగు నెలలు ప్రభుత్వమే ఉచితంగా గర్భధారణ చేయనున్నందున పాడి రైతులను డబ్బులు అడిగితే 98483 89542 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.
– జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పిచ్చిరెడ్డి